ఊహ తెలిసినప్పటినుంచి నాకు ఒక కల ఉండేది. ఊహూ... ఇది కొంచెం ఓవర్.కొంచెం వయసు వచ్చినప్పటినుంచి ఒక కల ఉండేది...ఆ కలలో నాకు ఒక ముద్దు మరదలు ఉంటుంది. ఉండడమే కాదు, నన్ను ముద్దుగా 'బావా...' అని పిలుస్తుంది.కానీ ఆ కల కలగానే ఉండిపోయింది. అలాగని నాకు మరదలు లేదనుకోకండి. లేకేం, బహువచనంలో ఉన్నారు.ఇద్దరు ఉన్నారు.కానీ ఏం లాభం?? చిన్నప్పటినుంచి చూస్తన్నా...(వాళ్ళ చిన్నపటినుంచి). "ఓరేయ్" "ఏరా" "ఓయ్" ఈ పిలుపులు తప్ప ఇంకో పిలుపు ఎరగను. ఓ సారి మా అమ్మమ్మ "ఏమే...వీడిని బావా అని పిలవచ్చు కదే..." అని అంటె ఒకసారి నన్ను ఎగాదిగా చూసి ముక్త కంఠంతో మొహాన ఉమ్మేసినంత పని చేసారు.ఈ జన్మకింతే అని సరిపెట్టుకున్నాను. పోన్లే... మనకంటూ ఒక లవరు రాదా?? దాన్నే రిక్వెస్టు చేద్దాం "బావా" అని పిలవమని అని ఆనందపడ్డాను. ఏళ్ళు గడిచాయి. దేవుడి దయ వల్ల లవరు కూడా సెట్టైంది.(నువ్వు నాస్తికుడివి కదా... అనకండి.కొన్ని పదాలు పడితేనే కొన్ని వాక్యాలు బావుంటాయి.). వన్ ఫైన్ మార్నింగ్ తనతో నా చిరు కోరిక విన్నవించాను.రెండు నిమిషాలు పైకి కిందకి చూసి ఫక్కున నవ్వింది. నవ్వి ఊరుకుందా?? ఏడిసావ్ .. వెధవ కోరికలూ నువ్వూనూ అని చక్కా పోయింది.నేనూ, నా ఆశ మిగిలాము. ఇంకా ఆశ చాలక తనకి చెల్లెలి వరస అయ్యేవాళ్ళెవరైనా ఉన్నారేమో కూపీ లాగాను.చెల్లెళ్ళు లేరు కానీ అక్కలు కుప్పలుగా ఉన్నారు, సర్దుకుంటావా? అని అడిగింది.పోనీ నాన్నకి చెప్పి ఎవరినైనా దత్తత తీసుకునేలాగ చెయ్యనా? అంది. అని నవ్వడం మొదలెట్టింది. బిక్కమొహం వెయ్యడం నా వంతైంది.
పుండు మీద కారం అంటే ఏంటో తెలుసా?? బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్లలాగా నా లవరుకి కుప్పలు తెప్పలుగ ఉన్నారు.... బావలు!! తన సెల్ ఫోన్ అడ్రెస్ బుక్ చూస్తే పేర్లు వరసగా కనిపిస్తాయి, రమెష్ బావ,కామెష్ బావ,పండు బావ, బుజ్జి బావ.. ఇలా...! అడిగితే ఇది మరీ బావుంది. నాకు చిన్నపటినుంచీ ఇలాగే అలవాటు అంది.ఉక్రోషం కొద్దీ "ఠాట్!అలా పిలవడానికి వీల్లేదన్నా"ను.అంతే...నేనెంత మేల్ చావనిస్టిక్ పిగ్ నో, నేను తన స్వేచ్చని ఎలా కాలరాయాలని చూస్తున్నానో వివరిస్తూ క్లాసు పీకింది. దెబ్బకి సాయంత్రం చలం గారి ఫొటో ముందు నుంచుని లెంపలేసుకుని క్షమాపణలు చెప్పుకున్నాను.
ఈ బాధలన్నీ బావాయణంలో మొదటి భాగం మత్రమే... రెండో భాగం ఇంకెప్పుడైనా...
Friday, February 8, 2008
Subscribe to:
Posts (Atom)