Tuesday, April 29, 2008

An Inconvenient Truth

ఇంటర్ దాకా నేను వేరే లోకం లో బతికాను. ఆ లోకంలో ఎంసెట్, క్రికెట్,ఇల్లు,స్నేహితులు తప్ప ఏమీ లేదు. అలాంటిది

ఇంజనీరింగ్ కోసం భీమవరం రాగానే నేను తిన్న షాకులు ఇన్నీ అన్నీ కాదు. కానీ, అన్నిటికన్నా ఎక్కువగా నన్ను బాధ పెట్టింది మాత్రం "కులం" అన్న పదం.

మీకు వెర్రితనంగా కనిపించవచ్చేమో గానీ, నేను అప్పటిదాకా ఈ కులం గిలం అనే ఫీలింగులన్నీ పెద్దవాళ్ళకే, మా "యంగ్ జనరేషన్" కి లేవు అనుకునేవాణ్ణి. అవును మరి, అప్పటిదాకా నా స్నేహితులతో అలాంటి చర్చ రాలేదు.

అసలు వాళ్ళది ఏ కులమో అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. మరి ఇంజనీరింగ్ లో.....

****************************

మొదటి రోజు. నాన్న నన్ను దింపి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే డాబా మీద నాకు "కులోపదేశం" జరిగింది.

"ఏమ్ కేస్టు..?" పేరు,ఊరు చెప్పిన వెంటనే వచ్చిన ప్రశ్న అది.

నాకు ఒక నిముషం ఏమ్ విన్నానో అర్ధం కాలేదు. అర్ధమయ్యాక చెప్పాను. సీనియర్ నవ్వాడు. పక్కనే ఉన్న ఇంకో జూనియర్ ని అడిగాడు. వాడూ చెప్పాడు. వాడిని వెంటనే ఇంకో సీనియర్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ప్రశ్నార్ధకం గా చూస్తున్న నాతో మొదటి సీనియరు "వాళ్ళోడే...." అన్నాడు. ఆ తర్వాత అతడి ఉపదేశం ఈ విధంగా సాగింది.


"చూడు తమ్ముడూ..! రేపు మనోళ్ళని పరిచయం చేస్తాను. టచ్ లో ఉండు. రేప్పుద్దున్న నీకేదైనా అవసరం వస్తే నీ ఫ్రెండ్సెవరూ సాయం చెయ్యరు. మనోళ్ళే చేస్తారు."


"ఈ ఊరులో *******ల డామినేషను ఎక్కువ!"


"మీ క్లాసు లో ఇంకా ఎవరెవరు మనోళ్ళునారో కనుక్కో! రేపు సాయంత్రం నాకు ఇవ్వాలి."

ఆ రోజు రాత్రి దుప్పటి ముసుగు కప్పుకుని వెక్కి వెక్కి ఏడిచాను. అది ర్యాగింగు వల్లా? ఇల్లు గుర్తురావడం వల్లా?నా ఒక చిన్న నమ్మకం నిర్ధాక్షిణ్యంగా నలిపివేయబడటం వల్లా అంటే మాత్రం చెప్పలేను.

On that night my little belief about the pristinity of young generation was shattered!


మా రూమ్మేటు ది కూడా అదే పరిస్థితి. నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగారా?? నీ కులం వాడి పేరే చెప్పాలి. వాడు ఒక హిట్టిచ్చి పదేళ్ళవుతున్నా, ఇంకా ఆప్పుడప్పుడే సినిమాలు చేస్తున్న బుడ్డోడైనా సరే..!

అదే నిన్ను ర్యాగింగ్ చేస్తున్నది వేరే కులం వాడైతే న్యూట్రల్ గా ఉండే పేరేదైనా చెప్పాలి.

"వాడితో తీసుకున్నావేరా రూము? మన వాళ్ళెవరూ దొరకలేదా??"

"ఒరేయ్! అక్కడ ఎవరో మన అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారట. పదండ్రా!"

కులం బలవంతంగా నరాల్లోకి ఇంజెక్టు చెయ్యబడుతుంది. you can't help it!
ఈ ఉన్మాదానికి పరాకాష్ట "కుల పండగలు". జనవరి లో వీటి హడావిడి మొదలవుతుంది. ప్రతీ కులానికి ఒక గ్యాంగ్ తయారై నాయకత్వ భాద్యతలు నెత్తిన వేసుకుంటుంది.
కాలేజ్ యాజమాన్యానికి తెలియకుండా రహస్యంగా ఏర్పాట్లు జరుగుతాయి. నేను రాను అని చెప్పినందుకు ఒక సీనియరు నాకిచ్చిన వివరణ ఇలా ఉంది.

" మేమేమీ కుల పిచ్చోళ్ళం కాదురా!ఏదో కొన్ని గంటలు సరదాగా
డాన్సులు కడతాం. అమ్మాయిలతో కబుర్లు చెబుతాం. తింటాం. వచ్చేస్తాం. ఈ మాత్రం దానికి పెద్ద సిద్ధాంతాలు,రాద్ధాంతాలు ఎందుకు బే??"

మరి నాకు ఈ "మనం" అన్న పదం దగ్గరే చిరాకొస్తోందే..?

ఈ కుల పండగల అజెండా ఇదీ....

అయా కులానికి చెందిన local heroes ని అతిధులుగా పిలుస్తారు.వారు ఆ కుల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రసంగిస్తారు.
తమ కుల హీరో పాటలకు డాన్సులు వెయ్యడం, వేరే కుల హీరోలని వేళాకోళం చేస్తూ skits చేయడం, and ofcourse flirting with the opposite sex of same caste!

it's a god damn brainwash!!!

మొత్తానికి కొన్ని నెలల వ్యవధిలో తెల్ల కాగితం లాంటి ఫ్రెషర్ మనసు మీద "కులకోటి" రాయబడుతుంది. ఆ పై సంవత్సరం వృత్తం మళ్ళీ మొదలవుతుంది.

ఇది కేవలం మా కాలేజ్ కే పరిమితం కాదు. నాకు తెల్సి ప్రతీ ఇంజనిరింగ్ కాలేజ్ లో జరిగేదే..! కాకపోతే dominant caste మారుతుంది అంతే.....


*******************************


నేనూ ఈ brainwash కు అతీతుడిని కాదు. సీనియర్ల వత్తిడి భరించలేక ఒక ఏడాది ఈ పండగకి వెళ్ళాను.

అప్పుడప్పుడూ నాలోనూ ఎక్కడో ఈ ఫీలింగ్ ఉందని నిరూపించే ఘటనలు జరుగుతుంటాయి. పేపర్లో ఎక్కడో నా కులం వాడికి ఎదైనా అవార్డు వచ్చిందని చదివినప్పుడు, ఎవరైనా పరిచయం చేసుకుంటూ తమ పేరు చెప్పినప్పుడు ఆ పేరులోexplicit గా నా కులం పేరు ఉన్నపుడు క్షణకాలం మనసులో ఎదో మెరుపు! మరుక్షణం సిగ్గేస్తుంది. ఆ తర్వాత దీనికి కారణమైన సీనియర్లపై కోపం వస్తుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత! అప్పుడు నాకు నేనే సర్దిచెప్పుకుంటాను.

"May be i have a bit of involuntary caste feeling. But atleast, i am not proud of it! "

Saturday, April 19, 2008

క్రికెట్టోపాఖ్యానం

ఈ రోజే సినిమాలు చూసే ప్రేక్షకులు ఎన్ని రకాలో విభజిస్తూ ఒక బ్లాగు చూసాను. అలాగే క్రికెట్టు మాచ్ లు చూసే వాళ్ళని కూడా విడదియ్యచ్చు కదా అనిపించింది. మన తెలుగు దర్సకుల్లా నిర్లజ్జగా అదే స్టైలులో ఈ పోస్టు రాయడానికి నిశ్చయించాను.

ఇండియాలో క్రికెట్ కున్న క్రేజు గురించి మళ్లీనేను చెప్పక్కర్లేదు. క్రికెట్ వస్తోందంటే కిళ్లీ కొట్ల నుంచి మల్తిప్లెక్సుల దాకా

ఎక్కడ టివి ఉంటే అక్కడే అతుక్కుపోతాము. అలా గుంపులో నిలబడి క్రికెట్ చూస్తున్నప్పుడు సాధారణమ్ గా

కనబడేవాళ్ళిదిగో...

నిశ్శబ్ద అభిమానులు:

వీళ్ళు పెద్దగా సందడి చెయ్యరు. మౌనంగానే ఆటని ఆస్వాదిస్తారు. మహా ఐతే అందరితో కలిసి చప్పట్లు కొడతారంతే....

కాని ఈ కేటగిరి చాలా రేర్.

వీరాభిమానులు:

అసలు హడావిడి అంతా వీళ్ళదే... ఇండియా గెలుస్తుంటే విజిల్సూ, ఓడుతుంటే నిట్టూర్పులూ...అసలు

ఓడిపోతున్న మన వాళ్ళు కూడా అంత ఫీలవరేమో...

షాట్లు కొడుతుంటే కేకలు మావా అంటారు. రెండు బాల్సు తిన్నారా.. ఎవడ్రా వీడిని సెలెక్ట్ చేసింది?? అని ఎగురుతారు.

రెండు వైడులు వేస్తే యార్కరు వేయడం కూడా రాదారా వీడికి?? అని అమితాశ్చర్యపోతారు.

వీళ్ళని అబ్జర్వు చెయ్యండి ఈ సారి. భలే కామెడీ గా ఉంటుంది.

నిరాశావాదులు:

వీళ్ల పక్కన ఉన్నామంటే నరకమే... మనమ్ మాచ్ గెలిచే చాన్సు కిన్చిత్ కూడా లేదని వీళ్ళ ప్రగాఢ నమ్మకం.

అయినా చూస్తారు. చూస్తూ ఉరుకుంటారా.... 20 బాల్సులో ౩౦ కొట్టాలా? మనవల్లెక్కడవుతుందీ... మాచ్ పోయినట్టే... అని పెదవులు విరుస్తూ వాళ్ళ predictions తో మన బుర్ర తింటారు.

ఆశావాదులు:

ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. 50బాల్సు లో 150 కొట్టాలి, శ్రీశాంత్,మునాఫ్ బాటింగు చేస్తున్నా వీళ్ళు ఆశ వదులుకోరు. పైగా శ్రీశాంత్ ఒకసారి రెండు సిక్సులేసాడు తెలుసా అని statistics చెబుతారు.

వీళ్ల వల్ల మనకి అట్టే బాధ లేదు.

విర్చువల్ కెప్టెన్లు: ( సరైన తెలుగు పదం దొరకలేదు. మన్నించండి)

ధోనీ కన్నా తామే మంచి కెప్టెన్ లమని వీళ్ళ నమ్మకం. టీవీ ముందు నిలుచునే సలహాలు ఇచేస్తారు.

"ఇఫ్ఫుడు పఠాన్ ని దింపాలి బౌలింగుకి..."

" ద్రావిడ్ దిగేడేంట్రా బాబూ...!"

" మూడో స్లిప్పుని తీసేసి మిడ్ ఆన్ లో పెడితే దొరికిపోతాడ్రా. ఆ మాత్రం ఐడియా రాలేదు వీడికి..."

ఇల్లా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. చేతిలో ఉన్న కూల్ డ్రింక్ బాటిలుతో వాళ్ల బుర్ర పగలగొట్టాలనిపిస్తుంది నాకైతే...

అభిమాన సంఘాలు:

సినిమాల్లోకి మల్లే ఇక్కడా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన ప్లేయరు లేనిదే జట్టు గెలవడం కల్లని

వీళ్ళ నమ్మకం. అందుకే సదరు ఆటగాడు అవుటవ్వగానే లేచి వెళ్ళిపోతుంటారు.

ఇండియా గెలిచిందా లేదా అన్నదానికంటే ఆ ప్లేయరు బాగా ఆడాడా లేదా అన్నదే వీరికి ముఖ్యం.

వీళ్ళకి కిర్రెక్కించాలంటే ఆ ప్లేయరు ని ఓ మాటని చూడండి. దెబ్బకి పోలేరమ్మ పూనకపోతే అడగండి!

దేశభక్తులు:

వీరిది అదోరకం దేశభక్తి. పాకిస్తాన్ ఆటగాడు ఏమీ అనకపోయినా వీళ్ళు మాత్రం "మార్ సాలే కో, మార్" అని

తెగ ఆవేశపడిపోతుంటారు.

ఇక పాకిస్తాన్ వాడు కాస్త ఎక్కువ చేసాడా?? అక్కడ మాచ్ రిఫరీ ,అంపైర్ రియాక్షన్ల కన్నా వీళ్ల రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నాలుగు ఐదు బూతులతో వాణ్ణి కడిగేస్తే గానీ వీళ్ళకి మనస్సాంతి ఉండదు.

నాకైతే కొన్నిసార్లు మొత్తం "దేశభక్తి" అన్న కాన్సెప్ట్ మీదే విరక్తి వస్తూ ఉంటుంది.

ఉపసంహారం:

ఇవీ ఈ రోజు క్రికెట్ చూస్తూ నేను పరిశీలించిన స్వభావాలు. నాకైతే క్రికెట్టు చూడటం ఎంతో, ఈ విభిన్న కేటగిరీల జనాలని గమనించడం కూడా అంతే సరదాగా అనిపిస్తుంది!

లోకోభిన్నరుచి.....

Sunday, April 6, 2008

నీహారిక

ఇంకా వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోకముందే సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని ఆ అలలు మీతో చెప్పే గుసగుసలని వినడానికి ప్రయత్నించారా?

వణికించే చలికాలంలో పొద్దున్న నీరెండ శరీరానికి చురుక్కుమని తగులుతుంటే కలిగే హాయిని అస్వాదించారా?

వెన్నెల వెలుగులో ముస్తాబైన లోకాన్ని చూడాలా? లేక ఆకాశం ఆంతా నిండిన ఆ జాబిలిని చూడాలా? అన్నసందిగ్ధం లో ఎప్పుడైనా కొట్టుమిట్టాడారా?

అసలంత సౌందర్యం భరించలేక కళ్ళల్లో ఎప్పుడైనా నీళ్లు తిరిగాయా?

ధనుర్మాసంలో చుట్టూ ఉన్నప్రపంచాన్ని పొగమంచు కప్పేసిన సుప్రభాత వేళ చెప్పులు లేకుండా పచ్చిక మీద నడిచారా? మంచు బిందువులు పాదాలకు చక్కిలిగింతలు పెడుతుంటే ఆ గిలిగింత ఎలా ఉంటుందో అనుభవమేనా?

భోరున కురిసినవాన వెలిసిన తరువాత తడిసి ముద్దైన ప్రకృతి కాంత సొగసులు గమనించారా? ఆకుల మీద నిలిచిన నీటి బిందువుల లావణ్యం చూసారా?

నడివేసవి మధ్యాన్నంఒక చెట్టు కింద సేద తీరుతూ పరిసరాలని గమనించారా? ఆకుల గలగలలు,వీచే గాలి, కూసే పక్షులు మీతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించిందా?

పౌర్ణమి రోజు సాగర తీరాన పొంగి వస్తున్నఅలల మీద నాట్యమాడుతున్న చంద్రకిరణాలతో స్నేహం చేసారా?

******************

ఆలోచిస్తే ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆనందాలన్నీ డబ్బు తో కొనలేనివే....

ఆస్వాదిస్తే అన్నిటికన్నా గొప్ప కవిత్వం ప్రకృతే...