Sunday, April 6, 2008

నీహారిక

ఇంకా వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోకముందే సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని ఆ అలలు మీతో చెప్పే గుసగుసలని వినడానికి ప్రయత్నించారా?

వణికించే చలికాలంలో పొద్దున్న నీరెండ శరీరానికి చురుక్కుమని తగులుతుంటే కలిగే హాయిని అస్వాదించారా?

వెన్నెల వెలుగులో ముస్తాబైన లోకాన్ని చూడాలా? లేక ఆకాశం ఆంతా నిండిన ఆ జాబిలిని చూడాలా? అన్నసందిగ్ధం లో ఎప్పుడైనా కొట్టుమిట్టాడారా?

అసలంత సౌందర్యం భరించలేక కళ్ళల్లో ఎప్పుడైనా నీళ్లు తిరిగాయా?

ధనుర్మాసంలో చుట్టూ ఉన్నప్రపంచాన్ని పొగమంచు కప్పేసిన సుప్రభాత వేళ చెప్పులు లేకుండా పచ్చిక మీద నడిచారా? మంచు బిందువులు పాదాలకు చక్కిలిగింతలు పెడుతుంటే ఆ గిలిగింత ఎలా ఉంటుందో అనుభవమేనా?

భోరున కురిసినవాన వెలిసిన తరువాత తడిసి ముద్దైన ప్రకృతి కాంత సొగసులు గమనించారా? ఆకుల మీద నిలిచిన నీటి బిందువుల లావణ్యం చూసారా?

నడివేసవి మధ్యాన్నంఒక చెట్టు కింద సేద తీరుతూ పరిసరాలని గమనించారా? ఆకుల గలగలలు,వీచే గాలి, కూసే పక్షులు మీతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించిందా?

పౌర్ణమి రోజు సాగర తీరాన పొంగి వస్తున్నఅలల మీద నాట్యమాడుతున్న చంద్రకిరణాలతో స్నేహం చేసారా?

******************

ఆలోచిస్తే ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆనందాలన్నీ డబ్బు తో కొనలేనివే....

ఆస్వాదిస్తే అన్నిటికన్నా గొప్ప కవిత్వం ప్రకృతే...