Saturday, April 19, 2008

క్రికెట్టోపాఖ్యానం

ఈ రోజే సినిమాలు చూసే ప్రేక్షకులు ఎన్ని రకాలో విభజిస్తూ ఒక బ్లాగు చూసాను. అలాగే క్రికెట్టు మాచ్ లు చూసే వాళ్ళని కూడా విడదియ్యచ్చు కదా అనిపించింది. మన తెలుగు దర్సకుల్లా నిర్లజ్జగా అదే స్టైలులో ఈ పోస్టు రాయడానికి నిశ్చయించాను.

ఇండియాలో క్రికెట్ కున్న క్రేజు గురించి మళ్లీనేను చెప్పక్కర్లేదు. క్రికెట్ వస్తోందంటే కిళ్లీ కొట్ల నుంచి మల్తిప్లెక్సుల దాకా

ఎక్కడ టివి ఉంటే అక్కడే అతుక్కుపోతాము. అలా గుంపులో నిలబడి క్రికెట్ చూస్తున్నప్పుడు సాధారణమ్ గా

కనబడేవాళ్ళిదిగో...

నిశ్శబ్ద అభిమానులు:

వీళ్ళు పెద్దగా సందడి చెయ్యరు. మౌనంగానే ఆటని ఆస్వాదిస్తారు. మహా ఐతే అందరితో కలిసి చప్పట్లు కొడతారంతే....

కాని ఈ కేటగిరి చాలా రేర్.

వీరాభిమానులు:

అసలు హడావిడి అంతా వీళ్ళదే... ఇండియా గెలుస్తుంటే విజిల్సూ, ఓడుతుంటే నిట్టూర్పులూ...అసలు

ఓడిపోతున్న మన వాళ్ళు కూడా అంత ఫీలవరేమో...

షాట్లు కొడుతుంటే కేకలు మావా అంటారు. రెండు బాల్సు తిన్నారా.. ఎవడ్రా వీడిని సెలెక్ట్ చేసింది?? అని ఎగురుతారు.

రెండు వైడులు వేస్తే యార్కరు వేయడం కూడా రాదారా వీడికి?? అని అమితాశ్చర్యపోతారు.

వీళ్ళని అబ్జర్వు చెయ్యండి ఈ సారి. భలే కామెడీ గా ఉంటుంది.

నిరాశావాదులు:

వీళ్ల పక్కన ఉన్నామంటే నరకమే... మనమ్ మాచ్ గెలిచే చాన్సు కిన్చిత్ కూడా లేదని వీళ్ళ ప్రగాఢ నమ్మకం.

అయినా చూస్తారు. చూస్తూ ఉరుకుంటారా.... 20 బాల్సులో ౩౦ కొట్టాలా? మనవల్లెక్కడవుతుందీ... మాచ్ పోయినట్టే... అని పెదవులు విరుస్తూ వాళ్ళ predictions తో మన బుర్ర తింటారు.

ఆశావాదులు:

ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. 50బాల్సు లో 150 కొట్టాలి, శ్రీశాంత్,మునాఫ్ బాటింగు చేస్తున్నా వీళ్ళు ఆశ వదులుకోరు. పైగా శ్రీశాంత్ ఒకసారి రెండు సిక్సులేసాడు తెలుసా అని statistics చెబుతారు.

వీళ్ల వల్ల మనకి అట్టే బాధ లేదు.

విర్చువల్ కెప్టెన్లు: ( సరైన తెలుగు పదం దొరకలేదు. మన్నించండి)

ధోనీ కన్నా తామే మంచి కెప్టెన్ లమని వీళ్ళ నమ్మకం. టీవీ ముందు నిలుచునే సలహాలు ఇచేస్తారు.

"ఇఫ్ఫుడు పఠాన్ ని దింపాలి బౌలింగుకి..."

" ద్రావిడ్ దిగేడేంట్రా బాబూ...!"

" మూడో స్లిప్పుని తీసేసి మిడ్ ఆన్ లో పెడితే దొరికిపోతాడ్రా. ఆ మాత్రం ఐడియా రాలేదు వీడికి..."

ఇల్లా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. చేతిలో ఉన్న కూల్ డ్రింక్ బాటిలుతో వాళ్ల బుర్ర పగలగొట్టాలనిపిస్తుంది నాకైతే...

అభిమాన సంఘాలు:

సినిమాల్లోకి మల్లే ఇక్కడా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన ప్లేయరు లేనిదే జట్టు గెలవడం కల్లని

వీళ్ళ నమ్మకం. అందుకే సదరు ఆటగాడు అవుటవ్వగానే లేచి వెళ్ళిపోతుంటారు.

ఇండియా గెలిచిందా లేదా అన్నదానికంటే ఆ ప్లేయరు బాగా ఆడాడా లేదా అన్నదే వీరికి ముఖ్యం.

వీళ్ళకి కిర్రెక్కించాలంటే ఆ ప్లేయరు ని ఓ మాటని చూడండి. దెబ్బకి పోలేరమ్మ పూనకపోతే అడగండి!

దేశభక్తులు:

వీరిది అదోరకం దేశభక్తి. పాకిస్తాన్ ఆటగాడు ఏమీ అనకపోయినా వీళ్ళు మాత్రం "మార్ సాలే కో, మార్" అని

తెగ ఆవేశపడిపోతుంటారు.

ఇక పాకిస్తాన్ వాడు కాస్త ఎక్కువ చేసాడా?? అక్కడ మాచ్ రిఫరీ ,అంపైర్ రియాక్షన్ల కన్నా వీళ్ల రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నాలుగు ఐదు బూతులతో వాణ్ణి కడిగేస్తే గానీ వీళ్ళకి మనస్సాంతి ఉండదు.

నాకైతే కొన్నిసార్లు మొత్తం "దేశభక్తి" అన్న కాన్సెప్ట్ మీదే విరక్తి వస్తూ ఉంటుంది.

ఉపసంహారం:

ఇవీ ఈ రోజు క్రికెట్ చూస్తూ నేను పరిశీలించిన స్వభావాలు. నాకైతే క్రికెట్టు చూడటం ఎంతో, ఈ విభిన్న కేటగిరీల జనాలని గమనించడం కూడా అంతే సరదాగా అనిపిస్తుంది!

లోకోభిన్నరుచి.....

2 comments:

Anonymous said...

జాబు సృజనాత్మకంగా రాసారు. అంతా బాగుంది, ఒక్కటి తప్ప - "మన తెలుగు దర్సకుల్లా నిర్లజ్జగా అదే స్టైలులో.."
అదేం కాదు, మీ స్టైలు మీదే!

San .D said...

ధన్యవాదాలండి.మరీ ఆ టపా చదివిన వెంటనే అదే మాదిరిగా రాస్తున్నాన్న అపరాధ భావం పట్టి పీడిస్తోంది.
ఎవరో ఎందుకు ఎత్తిచూపటం, మనమే తప్పొప్పుకుని మొదలెడితే పోలా అని ఆ విధంగా రాసాను.