Thursday, June 19, 2008

కాకినాడ క్లూసెనర్!

నిన్న ఆఫీసులో పనెక్కువై రాత్రి ఉండిపోయాను. పదకొండు కొట్టేసరికి నైట్ షిఫ్టులు చేస్తున్న యూత్ అంతా క్రికెట్టాడ్డానికి రడీ అయిపోయారు. క్రికెట్టంటే గ్రౌండులో కాదు. మా ఇరుకు ఆఫీసులోనే. cubicles మధ్యలో ఉన్న ప్లేసు మా పిచ్. కంపూటర్లకి, లైట్లకి తగిలినా ప్రమాదం లేని మెత్తని స్పాంజి బాలు. ఏదో క్యూబికల్ నుండి విరగ్గొట్టిన ప్లాస్టిక్ కర్ర బాట్టు. ఆ క్యుబికల్ కి తగిలితే టు. ఈ క్యూబికల్ కి తగిలితే ఫోరు. సీలింగుకి తగిలితే అవుటు. వన్ స్టెప్పు క్యాచులు.

ఇలా వాళ్ల సొంత మాన్యువల్ అన్నమాట!

(ఈ అలవాటు మన రక్తంలోనే ఉందనుకుంటా! ఆరడుగుల ఖాళీ దొరికితే చాలు, అందుబాటులో ఉన్నవాటినే బాట్టు, బాలు చేసుకుని మనకి మనమే కొత్త రూల్సు పెట్టేసుకుని ఆట మొదలెట్టేస్తాం.)

నేను ఊరుకోవచ్చు కదా? ఊహూ... వర్కు తెల్లవార్లూ ఉండేదే కదా కాస్సేపు రిలాక్సవుదామని నేనూ చేరిపోయాను. ఆ తర్వాత కద చెప్పేముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి.......

***************************************

నేను క్రికెట్టులో కొంచెం వీకు అంటే అది understatement of the century అవుతుందన్నమాట.

నాకు ఊహ తెలిసి మొదట క్రికెట్టు ఆడింది మా అన్నయ్యతో. మనకంటూ సొంత గ్యాంగు తయారైనాక మన క్రికెట్టు సరదా మరీ పెరిగింది. కానీ ఇక్కడే మా బండారు శివ గాడు నాకు తీరని ద్రోహం చేసాడు. చూడ్డానికి పిట్టలా ఉంటానని, మాస్టారు గారి అబ్బాయినని, గట్టిగా బౌలింగు చేస్తే ఆడలేననీ నాకు స్పెషలుగా బౌలింగు వేయించేవాడు. మన కి బౌలింగు వేరే! ఫీల్డింగు వేరే! అలా ఉత్తుత్తి క్రికెట్టు ఆడుతూ ఐదో క్లాసు వరకూ గడిపేసాను. ఆరో క్లాసులో కాకినాడకి వచ్చిన తరువాత నా క్రికెట్టు జీవితం మలుపు తిరిగింది.

మేముండే కాలనీలోని పిల్లల గ్యాంగుతో కలిసి ఆడటం మొదలెట్టాను. అక్కడ నా కెరీరు సచిన్ రేంజిలో లేకపోయినా కాంబ్లి రేంజ్ లో పడుతూ లేస్తూ సాగేది.అంతలో నా దృష్టి ఎదురుగా గ్రౌండులో ఆడుతున్న మా అన్న గ్యాంగు మీద పడింది. ఈ పిలకాయలతో ఆడితే ఏముంది మజా? ఆడితే అలా గ్రౌండులో ఆడాల అనుకున్నాను. అదే తడవగా వెళ్ళి ఆ గ్యాంగులో చేరిపోయాను. అక్కడి నుంచి మొదలయ్యాయి మన కష్టాలు.

మనకొచ్చిన ఆటా అంతత... ఆడేది నైన్తు, టెన్తు చదివే వాళ్లతో... వాళ్ల మధ్యలో బాగా తేలిపోయాను. వాళ్ళు కూడా మొదటలో భరించినా తర్వాత్ మొహమాటపడటం మానేసారు. అలా నేను ఆటలో అరటిపండునైపోయాను.
నేను బ్యాటింగ్ చేస్తుంటే అంతా నాకు మూడడుగుల దూరంలో కాసేవారు. బాలు వేసేసరికి నేను క్రీజులో ఓ చిన్న సైజు
భరతనాట్యం చేసేవాడిని.

నేను బౌలింగు చేస్తే ఆ బాలు బ్యాట్స్ మేన్ దగ్గరకి వెళ్ళడానికి ఐదారు స్టెప్పులైనా తీసుకునేది. దానికోసం ఎదురు చూసీ, చూసీ వాడికి శోష వచ్చేది.

నేను ఫీల్డింగు చేసే చోట కి బాలు వస్తే బ్యాట్స్ మేన్ కి పండగే... ఒక రన్ను వచ్చేచోట మూడు రన్నులు తీసేవారు. నేను త్రో విసిరితే అది బౌలరు దగ్గరికి నిక్కుతూ, నీలుగుతూ సర్కార్ ఎక్స్ ప్ర్రెస్సులా వెళ్ళేది.

జనాలు కేచ్ పట్టడం చూస్తే నాకెందుకో అద్బుతం చూసినట్టుండేది. నా స్ట్రాటజీ ఐతే రెండు చేతులూ దగ్గరికి తెచ్చి బాలు వస్తున్న దిశలో పెట్టి కళ్ళు మూసుకోవడమే!
ఇన్ని అవలక్షణాలున్న మనకి అక్కడ నిక్ నేమ్ ఏంటో తెలుసా! "క్లూసెనర్". నిజ్జంగా...! మీకు వెంటనే ఆ పేరు ఎగతాళిగా పెట్టినట్టు అనిపించవచ్చు. కానీ అది ఎగతాళి కాదనే నా నమ్మకం. ఎందుకో వాళ్ళు పిలిచే ఆ పిలుపులో హేళన ధ్వనించేది కాదు. ఏదేమైతేనేం, అలా నా పేరు అక్కడ క్లూసెనర్ గా ఫిక్సైంది.

ఇన్ని misadventures మధ్య నా కన్ను మా క్లాసు క్రికెట్ గ్యాంగు మీద పడింది. క్లాసులో క్లవరుగా మనకు కొంత ఫాలోయింగు ఉండేది. దాన్ని ఉపయోగించి టీములో ప్లేసు కొట్టేసా! కానీ కధ మామూలే! అదేంటో, నేను బ్యాట్టు ఎత్తేసరికి బాలు సర్రుమని పక్కనుంచి వెళ్ళిపోయేది. ఇహ లాభం లేదని టెంపరరీ రిటైర్ మెంటు ప్రకటించా.

నా సెకండు ఇన్నింగ్సు నా నైన్తు క్లాసులో మొదలై ముగిసింది. ఈ సారి మరీ ఘోరంగా! మా అజయ్ గాడు బౌలింగు చేస్తుంటే వాడి స్పీడు చూసి భయపడ్డ నన్ను చూసి నా బద్ధ శత్రువు రామ్మూర్తి గాడు ఎగతాళి గా నవ్విన నవ్వు ఎప్పటికి మరిచిపోలేను.

ఇహ లాభం లేదని నిరాశ పడుతున్న తరుణంలో వరంలా దొరికింది EA SPORTS వారి CRICKET 2002.
గ్రౌండులో కొట్టాలన్న షాట్లన్నీ కంప్య్యూటరు ముందు కూర్చుని ఎడాపెడా బాదేసా.. లెక్కపెట్టడానికి కూడా చిరాకు వచ్చేన్ని సెంచరీలు చేసేసా. ఇలా రెండేళ్ళు ఆడేసరికి ఇంకేంటి మనం మళ్ళీ ఫాంలోకి వచ్చేసామనే బలమైన భ్రాంతి వచ్చేసింది. దాంతో ఇంటర్ లో మళ్ళీ గ్రౌండులో కి అడుగు పెట్టాను.
రెండు బాల్సు ఆడేసరికి మత్తు దిగిపోయింది. కంప్యూటరు ముందు కూర్చుని కీలు నొక్కడానికి నిజంగా ఆడటానికి చాలా తేడా ఉందని అర్ధమైంది. దానితో ఇహ క్రికెట్ కి రాం రాం చెప్పేసి చక్కగా మళ్ళీ నా వీడియో గేములో సెంచరీలు కొట్టుకోవడం మొదలెట్టా.

అలా అని నా ఈ ఫ్లాషు బ్యాకులో అన్నీ చేదు గుర్తులే అనుకోకండి. After all, every dog has its day!
అలాగే నాకూ ఓ రోజు ఉంది. నేను సెవెన్త్ లో ఉండగా సిక్స్తు కుర్రాళ్ళతో జరిగిన ఆటలో మా వాళ్ళంతా వరసగా టపా కట్టేస్తుంటే ఓ పక్క నేను నిలబడ్డాను. మనం రన్నింగులో కూడా వీకేనని టీం మేనేజ్ మెంటు మనకి బై రన్నరుని ఇచ్చింది. వాడి సహాయంతో అష్టకష్టాలు పడుతూ ఐనా సరే, ఒకట్లూ రెళ్ళూ తీసాను. చివరకి ఆ బైరన్నరు అత్యుత్సాహానికి బలై నేను రన్నవుటయ్యే సరికి నా స్కోరు 13. అదే నా జట్టు స్కోరు కూడా.
ఇప్పటికీ ఆ ఒక్క ఇన్నింగ్సు తప్ప నాకు చెప్పుకోవడానికింకేమీ లేదు.
******************************************
మొత్తానికి నిన్న రాత్రి ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడాను. సరే క్యూబికల్ క్రికెట్టే కదా... ఆడలేకపోతానా అని ఆశ పడ్డాను.
ఊహూ... నా ఆశ అడియాశే అయింది. ఆడిన పది మ్యాచుల్లో నా స్కోర్లు ౦,౦,౦,౦,౦,౦,2,0,0,0.
నా టాలెంటు కొలీగ్సు కి కూడా తెలిసిపోయింది. నేనెన్ని రన్సు కొడతానని లెక్క పెట్టడం మానేసి, నేనెన్ని బాల్సు ఆడతానా అని లెక్కేసుకోవడం మొదలెట్టారు. నా మీద నాకే అసహ్యం వేసిందంటే నమ్మండి.
అలా అని మళ్ళీ ఆడటం మానేస్తానని అనుకుంటున్నారేమో? నాకస్సలు సిగ్గు లేదు. ఏడేళ్ళ తర్వాత మళ్ళీ బ్యాట్టు పట్టాను. ఎలా వదిలేస్తాను చెప్పండి. రేపు మా టీము అవుటింగు కి వెళుతోంది. బీచ్ క్రికెట్టు ఆడటానికి మా వాళ్ళు ప్లాను చేస్తున్నారు. ఎలాగోలా దూరిపోతా. ఎన్ని అవమానాలెదురైనా సరే... for the love of cricket!
wish me luck!

10 comments:

Anil Dasari said...

అస్సలు తగ్గొద్దు. ఏనాటికైనా విజయం నీదే :-)

Raj said...

పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూ ఉండండి. మిమ్మల్ని సెంచురి లక్ష్మి వరించుగాక.

రాఘవ said...

మీరు ఇప్పుడు నేర్చుకోండి, నేర్చుకోగలరు. Wish you the best of luck.

RG said...

నా నిక్‌నేం గుర్తుందికదా... షేన్‌వార్న్. మన బౌలింగ్ చూసి కాదు, ఏక్షన్ చూసి. నేను బౌలింగ్ వేస్తే బాలుకి రెండు సిక్సర్లు కొట్టొచ్చని జనాలు సంబరపడేవారు :)

Sujata M said...

Good. The real pleasure lies in enjoying doing what we want to do. Play more and more Cricket, as long as you enjoy it.

Unknown said...

భలే... మనం మనం ఒకటే!

Bolloju Baba said...

కాకినాడా? నాదీ కాకినాడే? (తెనాలి కాదు)
బాగుంది.
బొల్లోజు బాబా

రానారె said...

WIsh you good luck! :)

Purnima said...

3 cheers to you..

1st one.. for the title. Lance Klusener peru vini chaalaa years ayyindi.

2nd one: ball vastunte.. kallu moosesukOvatam.. hehehe.. idi naa alavaatu kooda. naa range ki tagattu TT ball ki bhayapaDataa. cricket ball ante gunda aagipotundi.

3rd one: marala marala try chestunnanduku. chakkagaa TT aadutunna abbayila madhya "nenoo" anToo velli.. valla aatani degrade chese naa aata gurinchi ika raayalsinde.

All the very best for you!!

San .D said...

@rsg
నమ్ము నమ్మకపో గానీ సరిగ్గా నీ గురించి అదే రాసానబ్బాయ్.మా అన్నయ్యనందరూ షేన్ వార్న్ అనేవారని చెప్పేవాడు నేనైతే నమ్మేవాణ్ణి కాదు అని...
తర్వాత ఎడిట్ చేసాను. సో, అసలు రహస్యం ఇదన్నమాట!

@ ప్రవీణ్ గార్లపాటి
ఛ... ఊర్కోండి మాస్టారూ! ఏదో నన్ను ఎంకరేజ్ చేద్దామని ఆలా అని ఉంటారు గానీ మీకు నాకూ పోలికేమిటీ?
మీ క్రికెట్ ప్రతిభ గురింఛి మీ బ్లాగులో ఓ సారి చదివినట్టే గుర్తు.
@ పూర్ణిమ
నాకు క్లూసెనర్ అంటే చాలా ఇష్టమండీ.అటు బౌలింగు,బాటింగు,ఫీల్డింగు కూడా అదరగొట్టే అతడి పేరు నాకు పెట్టడం irony కాక మరేంటి? ఏదేమైనా అతడిని తీసేసాడని స్మిత్ మీద చాలా కోపం నాకు.
నేను టేబిల్ టెన్నిస్ ని కూడా వదలలేదండి. మా ట్రైనింగు జరుగుతున్నప్పుడు మొదటిసారి ఆ ఆట చూసాను.చూసిందే తడవుగా వెళ్ళి మహామహుల మధ్య చేరిపోయాను. ఇంక నాతో ఆడలేక నన్ను ఆడొద్దని చెప్పలేక అంతా చచ్చారనుకోండి!