Tuesday, June 24, 2008

స్వప్నాంజలి

ఎవరెస్టు మీద నిలబడి సూర్యోదయాన్ని చూస్తున్నాను. కానీ నా మనసు ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేదు. అసహనంతో కాసేపు అటూ ఇటూ పచార్లు చేసాను. ఇంకా అంజలి రాలేదేంటి?? చిరాకనిపించి తాగుతున్న టీ కప్పుని పక్కనున్న డ్త్రైనేజీలోకి విసిరేసాను. వెనకాల కిలకిలా నవ్వు వినిపించింది. తిరిగి చూద్దును కదా! అంజలి!!
మొహంలోని ఆనందాన్ని దాచుకుని బుంగమూతి పెట్టుకున్నాను.
"ఏంటో, అబ్బాయిగారికంత కోపం??"
"నాకా! నాకెందుకూ కోపం?? నువ్వేమన్నా ఆలస్యంగా వచ్చావు గనుకనా నాకు కోపం రావడానికి..." ఉక్రోషంగా అన్నాన్నేను.
తను మళ్ళీ నవ్వింది. తను అలా నవ్వుతుంటే నా కోపాన్ని కట్టిబెట్టి నాకూ నవ్వాలనిపించింది. కానీ బలవంతాన మళ్ళీ కోపం తెచ్చుకున్నాను.
"కామన్ గా అబ్బాయిలు లేటుగా వచ్చారని అమ్మాయిలు కదా అలిగేది!" అంది తను నన్ను ఏడిపిస్తునట్టు.
"అంటే... అలిగే హక్కు అమ్మాయిలకే ఉందా!" రెట్టించాను నేను.
తను నవ్వి నా పక్కన కూర్చుంది. గోముగా "సారీ! ఇంకెప్పుడూ లేటుగా రాను. సరేనా..." అంది.
ఆ చిన్నమాటకే నేను ఐసైపోయాను. ఐనా చివరి ప్రయత్నంగా "నువ్వెప్పుడూ ఇలాగే అంటావు" అన్నాను.
అంజలి సమాధానం చెప్పలేదు. నా కళ్ళల్లోకి చూసి నవ్వింది. నేనూ నవ్వేసాను.
"ఇన్నాళ్ళూ ఏమైపోయావు?" తను అడిగింది.
"ఊరికే అలా షికారెళ్ళాను" నేను సమాధానమిచ్చాను.
"ఎక్కడికి"
నేను సమాధానం చెప్పలేదు. లేచి నిలబడి ఆకాశంలోని అల్మారా తలుపు తెరిచాను. ఒక పెట్టె తీసి ఆమె ముందు ఉంచాను.
"ఏంటిది" ఆమె ఉత్సాహంగా అడిగింది.
"తెరిచి చూడు"
తెరుస్తూనే ఆమె కళ్ళు విప్పారాయి. అందులో రెండు వందలకు పైగా అరలు. ప్రతి అరలోనూ మట్టి. అర బయట ఒక లేబిల్.
నేను నవ్వుతూ "లాస్ట్ టైమ్ మనం కలిసినపుడు ఏమన్నావో గుర్తుందా?" అన్నాను.
తను ఇంకా ఆశ్యర్యం నుండి కోలుకోలేదు.
"ప్రపంచంలోని అన్ని దేశాల soil ని సెకరించాలన్నది నీ చిన్నప్పటి కోరికని..."
"అందుకని..." నా మాటలని మధ్యలోనే కట్ చేసింది."దేశాలన్నీ తిరుగుతూ మట్టి ఏరుకుంటూ కూర్చున్నావా ఇన్నాళ్ళూ!"
ఒక్కక్షణం హర్టయ్యాను.
"నీకు నచ్చలేదా..."
తను చప్పున నా నెత్తిన మొట్టింది."మొద్దూ! ఇంత అభిమానంతో నాకోసం తెచ్చిన బహుమతి నచ్చకపోవడమా!"
ఆమె కళ్ళల్లో తడి నా దృష్టి ని దాటి పోలేదు.
"ఐనా నేను నీ కోసం తిరగలేదులే..." అన్నాను.
"మరి..."
"ప్రతీ కంట్రీలోనూ ఒక్కో గర్ల్ ఫ్రెండుని మెయిన్టైన్ చేస్తున్నాలే! అందర్నీ పలకరిద్దామని వెళ్ళి... పనిలో పనిగా...."
తను ఫక్కున నవ్వింది. "అబ్బో. మనకంత సీను కుడానూ!"
తన నవ్వులో నేనూ జత కలిపాను.
చుట్టూ ఉన్న ఆకాశం కరిగిపోయింది.
**********************************

కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఇసక! సహారా ఎడారిలో ఇద్దరమూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తున్నాము. "ఇక్కడకు తీసుకొచ్చావెందుకు?" అన్నాను. తనేం మాట్లాడలేదు.
తన వంక చూసాను. గులాబీ రంగు టాప్, వైట్ స్కర్ట్ లో దేవకన్యలా ఉంది.
"ఈ రోజు చాలా బావున్నావు" అన్నాను.
ఐనా తనేమీ మాట్లాడలేదు.ఎందుకో ముభావంగా ఉంది ఈ రోజు కలిసినప్పటి నుంచి.
అప్పుడు గమనించాను తన చెంపల చివర కన్నీటి చారికలని! నా గుండె ఆగినంత పనైంది.
తన భుజం మీద చెయ్యి వేసి "ఏమైందిరా అంజలీ!" అని అడిగాను.
తను నా భుజం మీద తల వాల్చి కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. నేను ఓదార్చే ప్రయత్నమేమీ చెయ్యలేదు.
ఆమె అలా కాస్సేపు తనివి తీరా ఏడ్చింది. ఆ తర్వాత ఆమే " పరీక్ష ఫెయిలయ్యాను రా!" అంది.
ఏం జరిగిందోనని కంగారు పడుతున్న నాకు ఆమె బేల గా ఈ విషయం చెప్పిన తీరుకు నవ్వొచ్చింది. కానీ సంభాళించుకున్నాను. తను అలా మాట్లాడుతుంటే వింటూ కూర్చున్నాను.
కాస్సేపటికి తను కాస్త తెప్పరిల్లింది. కానీ ఇంకా మొహంలో ఆ బాధ కనిపిస్తూనే ఉంది.
"ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదురా!" అంది బేలగా. వాళ్ళ నాన్నంటే అంజలికి చాలా భయం.
"పర్వాలేదురా" నేనన్నాను. "పేరెంట్స్ పైకి కఠినంగా కనిపించినా వాళ్ళకి మాత్రం నీ మీద ప్రేమ ఉండదా చెప్పు?
నువ్వు ఇలా ఏడుస్తున్నావని తెలిస్తే వాళ్ళెంత బాధ పడతారో తెలుసా?? ధైర్యంగా వెళ్ళి ఇంట్లో ఈ విషయం చెప్పు. ఈ సారి ఖచ్చితంగా పాసవుతానని హామీ ఇవ్వు నువ్వు definite గా పాసవుతావు. సరేనా!" అని బుజ్జగించాను.
ఆమె తలూపింది. మా చుట్టూ ఉన్న ఎడారి పూల తోట గా మారింది.
చాలా అమాయకంగా నా భుజం మీద తల ఆన్చి "నువ్వు లేకుండా ఎలా బతకగలనురా?" అని అడిగింది.
ఆ క్షణం నాలో చెలరేగిన భావాలని ఎలా చెప్పను??
తనతో " నీ సంగతి తెలీదు. నేను మాత్రం నువ్వు లేకుండా బతకలేను. I LOVE YOU" అని చెప్పాలనిపించింది.
ఊహూ. ఇది సమయం కాదు. చెపుతాను. తనని మళ్ళీ సారి కలిసినపుడు చెపుతాను. ...
************************************
మేమున్న తోటలోని ప్రతీ పువ్వు వాడిపోయి ఉంది. నా అంజలి వదనం కూడా! ఆ రోజు తర్వాత 8 నెలల దాకా అంజలి నాకు కనబడలేదు.ఇదిగో, మళ్ళీ ఇప్పుడు.!
"ఇన్ని నెలలూ ఏమైపోయావు అంజలీ" గొంతు పెగల్చుకొని అడిగాను.
తను చాలాసేపు మౌనంగా ఉంది. ఆ తరువాత అంది.
"రేపు నా పెళ్ళి"
విచిత్రంగా నేను షాక్ తినలేదు. ఎందుకో నాకు ఇది ముందే తెలిసినట్టనిపించింది.
"అంజలీ... నేను.. నిన్ను... i l.."
"నాకు తెలుసు." తను నా మాటలని మధ్యలోనే ఆపేసింది. తరువాత నెమ్మదిగా అంది.
"మన ఆఖరి కలయిక తరువాత నేను ప్రేమలో పడ్డాను"
నా మెదడు మొద్దు బారి పోయినట్టైంది. నా అంజలి... ఇంకొకరి ప్రేమలో... ఎలా?? ఎందుకు??
తను బుజ్జగిస్తున్నట్టు చెపుతోంది.
"అర్ధం చేసుకోరా! నువ్వంటే నాకెంత ఇష్టమైనా నువ్వు కేవలం నా స్వప్నానివి.వాస్తవానివి కాదు. మన ఈ కలయికలు ప్రతీ రాత్రి నేను కనే అందమైన కలలు. అంతే!"
"మరైతే నన్నెందుకు కల గన్నావు?" నేను కోపంతో అరిచాను." నన్నెందుకు నీ కలల్లో సృష్టించుకున్నావు?? నాతో ఎందుకు స్నేహం చేసావు? నీ కష్టాలు, సుఖాలు నాతో ఎందుకు పంచుకున్నావు??"
ఆమె తల వంచుకుంది.
"ఏమో! నా భావాలను పంచుకునేందుకు ఒక అందమైన ప్రేమికుడు కావాలని నేను ఆశ పడ్దానేమో! అందుకే నా మనసు కలల్లో నిన్ను సృష్టించి ఉండవచ్చు! అందుకే, పుస్తకాల్లో, సినిమాల్లో చూసిన సంఘటనలే నీతో జరిగినట్టు కలలు కని ఉండవచ్చు. అందుకే నాకు నిజ జీవితంలో ప్రేమికుడు దొరకగానే నీ కలలు రావడం ఆగిపోయాయి. అందుకే నేను నీకు ఈ స్వప్నలోకంలో కనిపించలేదు.
కానీ రేపు నా పెళ్ళి. ఎందుకో మళ్ళీ నువ్వు గుర్తొచ్చావు. అందుకే మళ్ళీ ఈ కల..."
నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
తను కొనసాగించింది.
"బహుశా, నిన్ను ఏ రోడ్డు మీదో, రైలు లోంచో క్షణకాలం చూసి ఉంటాను. ఆ రూపాన్నే నా మనసు నా కలల ప్రేమికుడిగా పరిచయం చేసి ఉంటుంది"
నాకు ఏడుపు వచ్చింది.
"అంతేనా? నేను కేవలం నీ కలనేనా! ఇంకేమి కానా??"
తన గొంతు గద్గదమయింది.
"కాదురా! నువ్వు నా కలవు మాత్రమే కాదు. ఆ దశని నువ్వు ఎప్పుడో దాటిపోయావు. నువ్వు నా జ్నాపకానివి. ప్రతీ అమ్మాయీ తన ప్రియుడి గురించి కలలు గంటుంది. నువ్వు నా కలలోకొచ్చి నా ప్రియుడివయ్యావు.కానీ వాస్తవాన్ని నేను మార్చలేను. మళ్ళీ నీ గురించి కల గంటానో లేదో నాకు తెలియదు. అంటే మళ్ళీ నిన్ను చూడటం కుదరకపోవచ్చు..."

తను నా గుండెలపై వాలింది. నేను తన భుజాలపై తల వాల్చాను. అలా ఎంత సేపు గడిచిందో తెలియదు. తను
అంది.
"నాకు మెలుకువ రాకుండా ఉంటే బావుండునురా!"
కాసేపటిలో చేజారిపోతున్నదని తెలిసినా నేను ఆమెని గట్టిగా పొదివి పట్టుకున్నాను.
అంజలికి మెలుకువ వచ్చే సమయం, నా స్వప్నాంజలి నాకు వీడ్కోలు పలికే సమయం వస్తుందని భయపడుతూ కళ్ళు మూసుకున్నాను.
****************************
కథ వెనుక కధ:
ఇక్కడి దాకా చదివాక కూడా మీకు మతి భ్రమించకుండా ఉంటే ఇహ ముందుకు వెళ్ళండి.
నేను చెప్పాలనుకున్న విషయాన్ని ఎల్లా చెప్పానో, ఎంత వరకూ succeed అయ్యనో నాకు తెలియదు. మొత్తం కధ రాసిన తరువాత ఓ సారి చదివితే బాగుందనిపించింది. మళ్ళీఇంకోసారి చదివితే నాకు పిచ్చి ఎక్కిందేమో నని భయం వేసింది. సర్లే, మనకి ఫ్రీ గా ఓ బ్లాగు ఉంది కదా అందులో రాసి జనాలని హింసించేద్దామని ఇలా ఎక్కించేసా...
అవిడియా వచ్చినప్పుడు చంకలు గుద్దుకున్నాను గానీ చదివిన తరువాత ఈ కధ పైన్ జిమ్ కేరీ "Eternal Sunshine of the spotless mind", "Truman Show" సినిమాల ప్రభావం ఉందని అర్ధమైంది. అప్పటికే too late!
మిమ్మల్ని హింసిస్తే క్షంతవ్యుడని!

5 comments:

oremuna said...

good one.

చేతన_Chetana said...

మీరు ఏమి చెప్దామనుకున్నారో, ఎంత వరకు succeed అయ్యారో నాకు తెలియదు కానీ, మీరు చెప్పింది మాత్రం బాగుంది, నచ్చింది, coz I can relate to it, to some extent.

Srinivas said...

నిజానికి బాగుంది. ఆ రెండు సినిమాల ప్రభావం నాకయితే కనపడలేదు. వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యాన్నీ, ప్రేమనీ ఇంకా బాగా డెవలప్ చేసి ఉండొచ్చు. మంచి అయిడియా.
- చిలకపాటి శ్రీనివాస్

RG said...

ఈ మధ్యేమైనా "The Others" సినిమా చూశావేంటి?? చివర్లో పంచ్ అలాగే ఉంది.

concept బావుంది గానీ, కొన్ని cliches ఉన్నాయి.

San .D said...

ఆగ్ రి్లీజైన తర్వాత వర్మ ఎలా ఫీలై ఉంటాడో నాకు ఇప్పుడు అర్ధమైంది. ఏదో అనేసుకున్నాను. ఏదో రాసేసాను. అట్టర్ ప్లాపైంది. కానీ ఇక్కడ నా సంజాయిషీ కొంత అవసరం అనిపించింది.
కధ పూర్తిగా cliches తో నిండి ఉందని నాకూ తెలుసు. actually i deliberately filled every line with beaten-to-death lines and expressions. అది ఒక టీనేజ్ అమ్మాయి కల.తన భావాలు పంచుకోవటానికి ఎవ్వరూ దొరక్క కలలోనే ఒక స్నేహితుడిని ఊహించుకుంది. కానీ ఆ కలని ఆ స్నేహితుడి perspective నుండి చెప్పాలని ప్రయత్నించాను. ఘోరంగా ఫెయిలయ్యాను.
కానీ అది cliched అంటే మాత్రం ఒప్పుకోలేను.it was meant to be cliched.
తను చూసిన సినిమాలలో సన్నివేశాలే కలలుగా వచ్చాయేమో అని ఆ పాత్ర అంటుంది కూడా!

ఏదైనా... it was a disaster! కానీ నేను వెనక్కి తగ్గేది లేదు.
ఈ సారి sarkar raj లాంటి టపాతో మీ ముందుకు వస్తాను.