Sunday, July 13, 2008

టిప్పు సుల్తానులు

మొన్నీ మధ్య స్నేహితులతో కలసి హోటలుకి వెళ్ళాను.ఫుడ్దు మీద దండయాత్ర జరిపాక బిల్లు చేతికి వచ్చింది.అదేంటో లక్కీగా కరెక్టు ఎమౌంటు
నా దగ్గర ఉంది. సర్లే కదా అని అక్కడ పెట్టేసి బయటకి నడిచాను.మా ప్రెండ్సు కేసి చూద్దును కదా... నేనేదో అడుక్కుంటున్న బిచ్చగాడి జోలెలోంచి
చిల్లర కొట్టేసినట్టు నా కేసి చూస్తున్నారు.
"ఏమైందిరా.." అని అడిగాను.
"అదేంట్రా... టిప్పివకుండా వచ్చేసావు?" అని అడిగాడు ఒకడు.
"కరెక్టు మనీ ఉంది కదా అని..."

"అక్కడ ఆ వెయిటరు మన కేసి ఎంత అసహ్యంగా చూసాడో తెలుసా..?" ఇంకొకడు అందుకున్నాడు.

నాకు విషయం అర్ధమైంది.

"అంటే వాడు తిట్టుకుంటాడేమో అని మనం టిప్పు ఇవ్వాలా..?"

"అలా కాదురా..మనకి బాగా సెర్వ్ చేసాడు కదా..!" ఇంకోడు చెప్పబోయాడు.

"అది వాడి ఉద్యోగం కదా..."

"జనరల్ గా అందరూ ఇస్తాం కదరా...?"

"అదే.. ఎందుకిస్తామో చెప్పు?"

ఇంకోడి కి మండింది."ఎహే.తొక్కలో పది రూపాయిలు టిప్పు గురించి ఇంత వాదిస్తావేంటెహె పీనాసోడిలాగా..?"

"ఇక్కడ మేటరు మనీ కాదురా... అసలు ఎందుకిస్తామో రీజను"
"బాబూ నక్సలైటూ! మళ్ళీ నీ ఆదర్శాలు మొదలెట్టకు. పద పోదాం" అంటూ ఇంకోడు కట్ చేసాడు. అక్కడితో ఆ ప్రహసనం ముగిసింది.

అదిగో.. అక్కడ చెప్పాలనుకున్న మాటలే ఇక్కడ బ్లాగుతున్నాను...

ప్రపంచంలో ఏ ఉద్యోగంలోనైనా మనం చేసే పనికి మన యజమాని మనకి జీతం ఇస్తాడు. మన పని బాగుంటే బోనస్సులూ,ఇంక్రిమెంటులూ అన్నీ యజమానే
చూసుకుంటాడు.అలా కాక మన పని మనం చెయ్యడానికి కస్టమరు నుండి డబ్బు డిమాండు చేస్తే అది లంచం అవుతుంది. at least, నాకు తెలిసి లంచం definition అదే...
మరి వెయిటర్లకి మాత్రం ఈ రూలు ఎందుకు మినహాయింపో నాకు అర్ధం కాదు.మనకి సెర్వ్ చెయ్యడం అతని ఉద్యోగం.అదే చేసాడు. నేను బిల్లు కడతాను.
మరి అదనంగా అతడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి??

but, thats not the worst part...అలా సరైన మొత్తంలో టిప్పు ఇవ్వని వాళ్ళందరూ పిసినారులని ఎందుకు అనుకోవాలి?
టిప్పు ఇవ్వకుండా వచ్చిన ప్రతీ సారీ ఆ హోటల్లోంచి స్పూనులు,ఫోర్కులు ఎత్తుకొచ్చినట్టు ఎందుకు గిల్టీ ఫీలవ్వాలి?
why this habit is so widely accepted around the world that whomever
don't follow it are labelled as queers?

మీలో ఇప్పటికే ఏంటిరా వీడి గోల ఇంత చిన్న విషయానికి అనుకుంటూ ఉండవచ్చు.కానీ సీరియస్ గా నాకు అర్ధం కాని విషయమిది.మీరు ఎప్పుడు హొటలుకి
వెళ్ళినా టిప్పు ఇస్తూనే ఉంటారు. అసలు ఎందుకు ఇస్తున్నారో ఆలోచించారా?
నాకు తట్టిన కారణాలివి...

1.అందరూ ఇస్తున్నారు కనుక.
2.చిన్నప్పటి నుండి అలవాటవడం వలన.
3.ఇవ్వక పోతే అంతా పిసినారి అనుకుంటారన్న భయం వల్ల .
4.వెయిటరు సర్వీసుతో satisfy అవ్వడం వలన.

కానీ ఎంత ఆలోచించినా అన్ని కారణాలకూ మూల కారణం మనం చిన్నప్పటి నుండి పెరిగిన కండిషనింగ్ వల్లనేమో అనిపిస్తుంది.కానీ అసలు ఈ అలవాటు ఎక్కడ ఎలా మొదలయింది అన్నది నాకు అంతు చిక్కని ప్రశ్న.

Believe me,టిప్పు ఇవ్వడం పెద్ద సమస్య అని నేను అనటం లేదు.కానీ tipping is no longer a gesture
of generosity now. its compulsory!టిప్పు ఇవ్వకపోవడం పెద్ద social stigma అయిపోయింది.
అదే ఎందుకు అని అడుగుతున్నాను.

ఇది ’చిల్లర’ సమస్య గా మీకనిపించవచ్చు . కానీ దీని వెనకాల ఉన్న లాజిక్కు ఆలోచించీ చించీ నాకు బుర్ర పిచ్చెక్కుతోంది.

మీలో ఎవరైనా దీనికి సంతృప్తికరమైన సమాధానం చెప్పగలరా?

Sunday, July 6, 2008

బెదిరేటి డ్రెస్సు నేనేస్తే...

నిన్న జానే తూ యా జానే నా... సినిమాకి వెళ్ళాను.విచిత్రంగా హీరో పేరు వచ్చినప్పుడు కామ్ గా ఉన్న జనం హీరోయిన్ జెనీలియా పేరు రాగానే ఈలలు వేసారు. ఆహా, జన్మ ధన్యమయింది కదా అనుకున్నాను.
నాది కాదు, జెనీలియాది.లేకపోతే ఈ దేశంలో హీరోయిన్ పేరుకి విజిల్సు పడటమూ,హిరోకి పడకపోవడమూనా! పైగా జెనీలియా తమిళంలో పెద్దగా పాపులర్ కూడా కాదు. (ఒక్క సంతోష్ సుబ్రమణియం తప్పిస్తే..). మరి ఆంధ్రా లో రియాక్షన్ ఎలా ఉందో నాకు తెలియదు.

ఇంతకీ నేను చెప్పదల్చుకున్న విషయం అది కాదు.

మీరు చెన్నైలో ఉంటున్నారా? సైటు కొడదామంటే ఒక్క అమ్మాయీ బాలేదని బాధతో కృంగి కృశిస్తున్నారా?? ఐతే మీకు ఒక కిటుకు చెపుతా చదవండి.చెన్నైలో అందమైన అమ్మాయిలకు కొదవ లేదు.కాకపోతే
వారు ఎక్కడ పడితే అక్కడ కనిపించరు.ఫర్ ఎగ్సాంపిల్,టైడల్ పార్కులో గనుక మీరు పని చేస్తుంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే!వెతికి వెతికి మీ కళ్ళు అలసిపోవడమే తప్ప లాభం ఉండదు. అదే అక్కడికి
రెండొందల అడుగుల దూరంలో ఉన్న అసెండాస్ ఐటి పార్కు కి వెళ్ళారా... జాతరే! ఇంకా ఎక్కువ రాస్తే జనాలు సామూహిక హత్యాయత్నం చేసే ప్రమాదం ఉంది గనుక ఇంక చెప్పను. ఇలాంటి
సలహాలు కావాల్సిన వారు మెయిల్ ద్వారా సంప్రదించండి.

నేను చెప్పొచ్చేదేంటంటే అల్లాంటి ప్రదేశాలే హిందీ సినిమాలు ఆడే హాళ్ళు. మల్టిప్లెక్సా,మామూలు హాలా అని సంబంధం లేదు. నగరంలోని creme de la creme అంతా అక్కడ కనిపిస్తారు మీకు.
కానీ నేను చెప్పదల్చుకున్నది దీని గురించి కూడా కాదు.



నిన్న ధియేటర్ ముందు నిలబడి వచ్చే పోయే జనాలని చూస్తుండగా నాకో వింత అవిడియా వచ్చింది.అప్పటి నుండి అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరి డ్రెస్సింగ్ గమనించటం మొదలెట్టాను.
రామ రామ!
మీరనుకునేంత యదవని కాదండీ బాబూ...! నా బాధ వేరే ఉంది. దాని కోసమే ఈ టపా!

నేను ఒక walking talking fashion faux pas ని.అనగా ఏ సమయంలో ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలియని, అసలు ఏ డ్రెస్సులు బావుంటాయో, ఏవి బావుండవో డిసైడ్ చేస్కోలేని
మొద్దునన్నమాట.( మనలో మన మాట. మనం అమ్మాయిల విషయంలో జర వీకుగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం!).

కారణం ఏమిటో తెలియదు గానీ నాకు షాపింగంటే మహా చిరాకు.ఆ విషయంలో నా maximum endurance limit రఫ్ గా ఓ 15 నిముషాలుంటుందంతే.పదహారవ నిమిషం నుండి
విసుగు స్టార్ట్ అవుతుంది.ఇరవై రెండవ నిముషానికి అది చికాకుగా మారుతుంది. ఇరవై తొమ్మిదో నిముషానికి అది కోపంగా పరిణమిస్తుంది. ముప్పై ఐదో నిమిషం దాటిందా...ఇక నాకు ఊపిరాడదు.
నేను అగ్గి రాముణ్ణే అన్న మాట.ఆ సమయానికి కళ్ళ ముందు ఏ డ్రెస్ కనబడితే అది సెలెక్టు చేసుకుని బయటకు వచ్చేసి ఊపిరి పీల్చుకుంటాను. అందుకే, గంటలు గంటలు విసుగు, అలుపూ లేకుండా
అలా షాపులన్నీ తిరిగే జనాలని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది.

ముఖ్యంగా చెన్నైలో టి నగర్ కి వెళ్లామా,జనాలు రాత్రి పూట అక్కడే దుప్పట్లు పరుచుకుని పడుకుంటారు. పొద్దున్న షాపులు ఓపెన్ చెయ్యడం ఆలస్యం లోపలికి పరిగెడతారు.
అందుకేనేమో, చాలా షాపులలో రెస్టారెంట్లు కూడా తెరిచారు. ఇహ ఉదయాన్నే వెళ్ళడం, తిరగడం, అక్కడే ఏదో ఒకటి తినడం, మళ్ళీ షాపింగ్. నాలాంటి వాళ్ళ కోసం ఆక్సిజన్ బార్లు కూడా తెరిస్తే
బావుణ్ణు!

ఇంతకీ ఈ షాపింగ్ పోబియా వల్ల జన్మలో ఒక మంచి బట్ట కట్టి ఎరుగను.ఖర్మ కాలి ఆ అరగంట లోపలనే ఏదైనా డ్రెస్సు నచ్చినా ఇంటికొచ్చి వేసుకునే సరికి అదే డ్రెస్సు ఇంకో రకంగా అనిపిస్తుంది.
అదేంటో విచిత్రం,మా అన్న గాడు వేసుకున్న డ్రెస్సులు చాలా బావున్నాయని కబ్జా చేసి లాక్కుంటే నా ఒంటి మీదకి రాగానే వాటి అందం కాకెత్తుకుపోయినట్టు మాయమైపోతుంది.ఒక్కొక్క సారి ఇదేమైనా పూర్వజన్మ
పాపమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు.

ఈ మద్యే ఈ దుస్థితికి చరమ గీతం పాడాలని సంకల్పించాను.నా ward robe ని పూర్తిగా మార్చెయ్య తలచి నా బ్యాంకు బాలెన్సుని ఓ సారి తనివి తీరా చూసుకుని, ఆ స్క్రీన్ షాటుని సేవ్
చేసుకుని, కడసారి కన్నీటి వీడ్కోలు పలికి లాగవుట్ చేసాను.దెబ్బకి సినిమా హీరోలా తయారవ్వాలి అనుకుని షాపులోకి అడుగు పెట్టాను.కానీ నన్ను నా శాపం వదల్లేదు.
అదేంటో షర్టులన్ని white,blue,cream.ఫాంటులన్నీ black,brown,cream,blue.నా కళ్ళకి మిగతా రంగులని గుర్తించే పవర్ లేదు. ఎన్ని పెర్ముటేషన్లు వేసినా కుదరడం లేదే...
అసలు బయట kool dudes గా బావించబడే వాళ్ళు ఏం వేసుకుంటున్నారా అని సందేహం వచ్చింది. అసలు ముందు ఇదంతా బాగా పరిశీలిస్తే మంచిదని తీర్మానించాను.
అదిగో సరిగా అందుకే సినిమా హాలు బయట నా బీటింగు.

ఒక ఐదు నిమిషాలు గమనించానో లేదో నాకో ఘోర సత్యం తెలిసింది.దానికంటే ముందు నా పరిశీలన/పరిశోధన తాలూకు వివరాలివీ....

నాకు తెలిసిన అమ్మాయిల డ్రెస్స్లులు రెండే.చీర,చూడీదార్. మా కాకినాడలో అంతే. అదేంటో అక్కడ ఈ కేటగిరి లోకి వచ్చే అమ్మాయి ఒక్కరూ లేరు. అసలు ఆ డ్రెస్సులని ఏమంటారో కూడా నాకు తెలీదు.
అసలు నేనెప్పుడూ చూడలేదు.కాని విచిత్రమేమిటంటే, ఒక అమ్మాయి వేసిన టైపు డ్రెస్సు ఇంకో అమ్మాయి వెయ్యలేదు.అన్ని రకాలున్నాయి అక్కడ.

మరో వైపు అబ్బాయిలు.( న్యాయంగా ఐతే నా పరిశీలన కి అబ్బాయిలని పరిశీలిస్తే సరిపోతుంది. కానీ పక్షపాతం చూపించటం ఇష్టం లేక అమ్మాయిలని కూడా చూడాల్సి వచ్చింది.).
నేను చూసిన ప్రతీ వాడూ దాదాపుగా యూనిఫామ్ లో ఉన్నట్టున్నారు.ముప్పాతిక శాతం బ్లూ జీన్సు.పాతిక శాతం క్రీమ్ కలర్ కార్గో ఫేంటు.ఐతే షర్టు.లేకపోతే టీ షర్టు.అంతా కలిపి మూడు కలర్లున్నాయి అక్కడ.
red,blue,black.

అయినా విచిత్రం గా వాళ్ళకి ఆ డ్రెస్సులు బానే ఉన్నాయి.yet i am sure, the moment i wear them, i will look like a complete idiot!

సరే నా బాధలు తీరేవి కాదు వదిలెయ్యండి.కానీ ఏమిటీ అన్యాయం.ఎందుకీ ఘోరం.అమ్మాయిలకి అన్ని రకాల choices ఉన్నాయి. hell, ఆఖరికి వేసుకునే చెప్పుల విషయంలో కూడా
ఈ తేడా ప్రస్పుటంగా కనబడుతుంది. ఇది సరిపోదన్నట్టు అమ్మాయిలకి నగలు,మేకప్పులు ఇంకా బోలెడన్ని accessories. పట్టుకునే పర్సు కూడా అతివలకి అలంకారమే.మరి మగాళ్ళకో,
అది కామ్ గా ఓ మూల నక్కి ఉంటుంది.

ఇన్ని అలంకారాల మద్య నా బోటి వాడు అందరికీ ఏబ్రాసిలా కనబడక చస్తాడా? అందుకే అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ ఏం చేస్తానో అదే చేసాను.ఎవ్వరికీ కనబడకుండా ఓ మూల దాక్కున్నట్టు నిలబడి సినిమా
స్టార్ట్ అయ్యి లైట్లు ఆర్పేదాకా వెయిట్ చేసాను. వాడు ఒక్క సారి లైట్లు ఆర్పగానే ధైర్యంగా లోపలకి అడుగు పెట్టాను.సినిమా క్రెడిట్స్ ఇంకా అవుతుండగానే లోపల బాంబు ఉన్నట్టు పరిగెత్తుకు వచ్చేసాను.

చివరాఖరికి నే చెప్పొచ్చేదేమిటంటే, fashion is not my cup of Tea!