Thursday, June 19, 2008

కాకినాడ క్లూసెనర్!

నిన్న ఆఫీసులో పనెక్కువై రాత్రి ఉండిపోయాను. పదకొండు కొట్టేసరికి నైట్ షిఫ్టులు చేస్తున్న యూత్ అంతా క్రికెట్టాడ్డానికి రడీ అయిపోయారు. క్రికెట్టంటే గ్రౌండులో కాదు. మా ఇరుకు ఆఫీసులోనే. cubicles మధ్యలో ఉన్న ప్లేసు మా పిచ్. కంపూటర్లకి, లైట్లకి తగిలినా ప్రమాదం లేని మెత్తని స్పాంజి బాలు. ఏదో క్యూబికల్ నుండి విరగ్గొట్టిన ప్లాస్టిక్ కర్ర బాట్టు. ఆ క్యుబికల్ కి తగిలితే టు. ఈ క్యూబికల్ కి తగిలితే ఫోరు. సీలింగుకి తగిలితే అవుటు. వన్ స్టెప్పు క్యాచులు.

ఇలా వాళ్ల సొంత మాన్యువల్ అన్నమాట!

(ఈ అలవాటు మన రక్తంలోనే ఉందనుకుంటా! ఆరడుగుల ఖాళీ దొరికితే చాలు, అందుబాటులో ఉన్నవాటినే బాట్టు, బాలు చేసుకుని మనకి మనమే కొత్త రూల్సు పెట్టేసుకుని ఆట మొదలెట్టేస్తాం.)

నేను ఊరుకోవచ్చు కదా? ఊహూ... వర్కు తెల్లవార్లూ ఉండేదే కదా కాస్సేపు రిలాక్సవుదామని నేనూ చేరిపోయాను. ఆ తర్వాత కద చెప్పేముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి.......

***************************************

నేను క్రికెట్టులో కొంచెం వీకు అంటే అది understatement of the century అవుతుందన్నమాట.

నాకు ఊహ తెలిసి మొదట క్రికెట్టు ఆడింది మా అన్నయ్యతో. మనకంటూ సొంత గ్యాంగు తయారైనాక మన క్రికెట్టు సరదా మరీ పెరిగింది. కానీ ఇక్కడే మా బండారు శివ గాడు నాకు తీరని ద్రోహం చేసాడు. చూడ్డానికి పిట్టలా ఉంటానని, మాస్టారు గారి అబ్బాయినని, గట్టిగా బౌలింగు చేస్తే ఆడలేననీ నాకు స్పెషలుగా బౌలింగు వేయించేవాడు. మన కి బౌలింగు వేరే! ఫీల్డింగు వేరే! అలా ఉత్తుత్తి క్రికెట్టు ఆడుతూ ఐదో క్లాసు వరకూ గడిపేసాను. ఆరో క్లాసులో కాకినాడకి వచ్చిన తరువాత నా క్రికెట్టు జీవితం మలుపు తిరిగింది.

మేముండే కాలనీలోని పిల్లల గ్యాంగుతో కలిసి ఆడటం మొదలెట్టాను. అక్కడ నా కెరీరు సచిన్ రేంజిలో లేకపోయినా కాంబ్లి రేంజ్ లో పడుతూ లేస్తూ సాగేది.అంతలో నా దృష్టి ఎదురుగా గ్రౌండులో ఆడుతున్న మా అన్న గ్యాంగు మీద పడింది. ఈ పిలకాయలతో ఆడితే ఏముంది మజా? ఆడితే అలా గ్రౌండులో ఆడాల అనుకున్నాను. అదే తడవగా వెళ్ళి ఆ గ్యాంగులో చేరిపోయాను. అక్కడి నుంచి మొదలయ్యాయి మన కష్టాలు.

మనకొచ్చిన ఆటా అంతత... ఆడేది నైన్తు, టెన్తు చదివే వాళ్లతో... వాళ్ల మధ్యలో బాగా తేలిపోయాను. వాళ్ళు కూడా మొదటలో భరించినా తర్వాత్ మొహమాటపడటం మానేసారు. అలా నేను ఆటలో అరటిపండునైపోయాను.
నేను బ్యాటింగ్ చేస్తుంటే అంతా నాకు మూడడుగుల దూరంలో కాసేవారు. బాలు వేసేసరికి నేను క్రీజులో ఓ చిన్న సైజు
భరతనాట్యం చేసేవాడిని.

నేను బౌలింగు చేస్తే ఆ బాలు బ్యాట్స్ మేన్ దగ్గరకి వెళ్ళడానికి ఐదారు స్టెప్పులైనా తీసుకునేది. దానికోసం ఎదురు చూసీ, చూసీ వాడికి శోష వచ్చేది.

నేను ఫీల్డింగు చేసే చోట కి బాలు వస్తే బ్యాట్స్ మేన్ కి పండగే... ఒక రన్ను వచ్చేచోట మూడు రన్నులు తీసేవారు. నేను త్రో విసిరితే అది బౌలరు దగ్గరికి నిక్కుతూ, నీలుగుతూ సర్కార్ ఎక్స్ ప్ర్రెస్సులా వెళ్ళేది.

జనాలు కేచ్ పట్టడం చూస్తే నాకెందుకో అద్బుతం చూసినట్టుండేది. నా స్ట్రాటజీ ఐతే రెండు చేతులూ దగ్గరికి తెచ్చి బాలు వస్తున్న దిశలో పెట్టి కళ్ళు మూసుకోవడమే!
ఇన్ని అవలక్షణాలున్న మనకి అక్కడ నిక్ నేమ్ ఏంటో తెలుసా! "క్లూసెనర్". నిజ్జంగా...! మీకు వెంటనే ఆ పేరు ఎగతాళిగా పెట్టినట్టు అనిపించవచ్చు. కానీ అది ఎగతాళి కాదనే నా నమ్మకం. ఎందుకో వాళ్ళు పిలిచే ఆ పిలుపులో హేళన ధ్వనించేది కాదు. ఏదేమైతేనేం, అలా నా పేరు అక్కడ క్లూసెనర్ గా ఫిక్సైంది.

ఇన్ని misadventures మధ్య నా కన్ను మా క్లాసు క్రికెట్ గ్యాంగు మీద పడింది. క్లాసులో క్లవరుగా మనకు కొంత ఫాలోయింగు ఉండేది. దాన్ని ఉపయోగించి టీములో ప్లేసు కొట్టేసా! కానీ కధ మామూలే! అదేంటో, నేను బ్యాట్టు ఎత్తేసరికి బాలు సర్రుమని పక్కనుంచి వెళ్ళిపోయేది. ఇహ లాభం లేదని టెంపరరీ రిటైర్ మెంటు ప్రకటించా.

నా సెకండు ఇన్నింగ్సు నా నైన్తు క్లాసులో మొదలై ముగిసింది. ఈ సారి మరీ ఘోరంగా! మా అజయ్ గాడు బౌలింగు చేస్తుంటే వాడి స్పీడు చూసి భయపడ్డ నన్ను చూసి నా బద్ధ శత్రువు రామ్మూర్తి గాడు ఎగతాళి గా నవ్విన నవ్వు ఎప్పటికి మరిచిపోలేను.

ఇహ లాభం లేదని నిరాశ పడుతున్న తరుణంలో వరంలా దొరికింది EA SPORTS వారి CRICKET 2002.
గ్రౌండులో కొట్టాలన్న షాట్లన్నీ కంప్య్యూటరు ముందు కూర్చుని ఎడాపెడా బాదేసా.. లెక్కపెట్టడానికి కూడా చిరాకు వచ్చేన్ని సెంచరీలు చేసేసా. ఇలా రెండేళ్ళు ఆడేసరికి ఇంకేంటి మనం మళ్ళీ ఫాంలోకి వచ్చేసామనే బలమైన భ్రాంతి వచ్చేసింది. దాంతో ఇంటర్ లో మళ్ళీ గ్రౌండులో కి అడుగు పెట్టాను.
రెండు బాల్సు ఆడేసరికి మత్తు దిగిపోయింది. కంప్యూటరు ముందు కూర్చుని కీలు నొక్కడానికి నిజంగా ఆడటానికి చాలా తేడా ఉందని అర్ధమైంది. దానితో ఇహ క్రికెట్ కి రాం రాం చెప్పేసి చక్కగా మళ్ళీ నా వీడియో గేములో సెంచరీలు కొట్టుకోవడం మొదలెట్టా.

అలా అని నా ఈ ఫ్లాషు బ్యాకులో అన్నీ చేదు గుర్తులే అనుకోకండి. After all, every dog has its day!
అలాగే నాకూ ఓ రోజు ఉంది. నేను సెవెన్త్ లో ఉండగా సిక్స్తు కుర్రాళ్ళతో జరిగిన ఆటలో మా వాళ్ళంతా వరసగా టపా కట్టేస్తుంటే ఓ పక్క నేను నిలబడ్డాను. మనం రన్నింగులో కూడా వీకేనని టీం మేనేజ్ మెంటు మనకి బై రన్నరుని ఇచ్చింది. వాడి సహాయంతో అష్టకష్టాలు పడుతూ ఐనా సరే, ఒకట్లూ రెళ్ళూ తీసాను. చివరకి ఆ బైరన్నరు అత్యుత్సాహానికి బలై నేను రన్నవుటయ్యే సరికి నా స్కోరు 13. అదే నా జట్టు స్కోరు కూడా.
ఇప్పటికీ ఆ ఒక్క ఇన్నింగ్సు తప్ప నాకు చెప్పుకోవడానికింకేమీ లేదు.
******************************************
మొత్తానికి నిన్న రాత్రి ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడాను. సరే క్యూబికల్ క్రికెట్టే కదా... ఆడలేకపోతానా అని ఆశ పడ్డాను.
ఊహూ... నా ఆశ అడియాశే అయింది. ఆడిన పది మ్యాచుల్లో నా స్కోర్లు ౦,౦,౦,౦,౦,౦,2,0,0,0.
నా టాలెంటు కొలీగ్సు కి కూడా తెలిసిపోయింది. నేనెన్ని రన్సు కొడతానని లెక్క పెట్టడం మానేసి, నేనెన్ని బాల్సు ఆడతానా అని లెక్కేసుకోవడం మొదలెట్టారు. నా మీద నాకే అసహ్యం వేసిందంటే నమ్మండి.
అలా అని మళ్ళీ ఆడటం మానేస్తానని అనుకుంటున్నారేమో? నాకస్సలు సిగ్గు లేదు. ఏడేళ్ళ తర్వాత మళ్ళీ బ్యాట్టు పట్టాను. ఎలా వదిలేస్తాను చెప్పండి. రేపు మా టీము అవుటింగు కి వెళుతోంది. బీచ్ క్రికెట్టు ఆడటానికి మా వాళ్ళు ప్లాను చేస్తున్నారు. ఎలాగోలా దూరిపోతా. ఎన్ని అవమానాలెదురైనా సరే... for the love of cricket!
wish me luck!

Tuesday, May 27, 2008

నేనూ... అమ్మాయిలు

అమ్మాయిలతో నాకదే ఇబ్బంది. తెలిసి అంటారో, తెలీక అంటారో తెలీదు గానీ గబుక్కున అనేస్తారు. అవతల వాడు ఏమనుకుంటాడో అని అస్సలు ఆలోచించరు. మేటరు చెప్పకుండా ఏంటీ సోది అంటారా? మేటరు ఎక్కువ లేనప్పుడు ఇల్లాగే పోస్టు నింపాలి. ఇక నా బాధ ఏంటంటే....

****************************

నేను,రవి గాడు కలిసి రోడ్డు మీద వెళ్తున్నాం. నాలుగడుగులేసామో లేదో ఎవరో అమ్మాయి వాణ్ణి చూసి చెయ్యి ఊపింది. మనోడూ ఊపాడు. ఇహ సొల్లు మొదలైంది. ఇదే నాకు వాడిని చూస్తే మండేది. ఊరందరూ ఫ్రెండ్సే యదవకి. అందులో సమస్య లేదు. సమస్యల్లా ఆ ఫ్రెండ్సులో తొంభై శాతం అమ్మాయిలే. ఎప్పుడు బయటకి వెళ్ళినా సందుకో అమ్మాయి తగలడం, పక్కన నన్ను దిష్టి బొమ్మలా నిలబెట్టి వాళ్ళిద్దరూ సొల్లేసుకోవడం.మనం లేడీసు డిపార్టుమెంటులో కొద్దిగా వీకులెండి. పాపం. మా వాడు నన్ను పరిచయం చేసేవాడు కొత్తలో.ఆ అమ్మాయి "అయితే ఏంటంట" అన్న టైపులో వాడికేసి చూసి, మర్యాదకి నా వైపు ఓ సారి నవ్వి మళ్ళీ వాడితో సొల్లు మొదలెట్టేది. ఇహ లాభం లేదని లైటు తీస్కున్నాడు. అంత anti girl repellent నా దగ్గర ఏంఉందో ఇప్పటికీ అర్ధం కాదు. ఆ విషయం పక్కన బెట్టి ప్రస్తుతానికి వద్దాం.

ఆ అమ్మాయి సడెన్ గా నన్ను చూపించి "తనూ..." అంది ప్రశ్నార్ధకంగా. ఇహ చూస్కోండి. నాకైతే అక్కడే వీణ స్టెప్పు వెయ్యాలనిపించింది. ఒక అమ్మాయి నా existance ని acknowledge చెయ్యడమా!

ఎన్నాళ్ళో వేచిన ఉదయం..... ఈ నాడే ఎదురవుతుంటే.... అంటూ పాట పాడేసుకున్నాను. ఇంకా సిట్యుయేషన్ కి సరిపొయే పాటలేమున్నాయని ఆలోచిస్తుంటే రవిగాడు చెప్పాడు. " తను సందీప్ అని. నా క్లాస్ మేట్"

ఈ లోగా నేను తర్వాత పాటకి వచ్చాను.

" భలే మంచి రోజు. పసందైన రోజు.. వసంతాలు కురిసే..."

"నిజ్జంగా..."

ఎక్కడో అపసృతి వినిపించింది. ఆ అమ్మాయి బోలెడంత అమితాస్చర్యపడిపోయి లేచి

"అలా అస్సలు కనిపించడం లేదు తెలుసా! చిన్న పిల్లాడిలా ఉన్నాడు. నీ తమ్ముడేమో అనుకున్నా!"

ఇహ అంతే! నాకింకే కనిపించలేదు. వినిపించలేదు. హిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వా. ఆ ప్రహసనం అలా ముగిసింది.

**************************************

ఒకవేళ మీరు ముప్పైల్లో ఉంటే పై కామెంటు చెవులకింపుగా అనిపించవచ్చు. కానీ మీరు ఇరవై రెండేళ్ల కుర్రాడై, ఒక అమ్మాయి మిమ్మల్ని చిన్నపిల్లాడిలా చూస్తోందంటే అంత కంటే hurting thing ఇంకోటి ఉండదు. అదీ మొదటి పరిచయంలో....

ఇప్పుడు చెప్పండి. ఒక అబ్బాయికి తన స్నేహితురాలు ఇంకో స్నేహితురాలిని పరిచయం చేసిందే అనుకోండి. ఆ అబ్బాయి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడు?? ఒకపక్క అతిగా మాట్లాడకుండా, మరోపక్క పూర్తిగా ఇగ్నోర్ చెయ్యకుండా

మేనేజ్ చేస్తాడు. or atleast, నేను చూసిన ప్రతి సందర్భంలోనూ అలానే జరిగింది.

మరి అమ్మాయిల విషయంలో ఇలా ఎందుకు ఉండదు??

ఒక్క సంఘటన కే నెను జనరలైజ్ చేసేస్తున్నానని మీకు అనిపించవచ్చు. believe me. thats only one of the incidents!

*******************************

ఇల్లాంటి ఘోరావమానమే ఇంకో ఏడాది కి జరిగింది. నేనూ, ప్రవీణూ ఏదో ఎస్సైన్ మెంటు మీద పని చేస్తున్నాం. అంతలో వాడి సవాలక్ష ఆడ స్నేహితుల్లో ఒక స్నేహితురాలు ఫోన్ చేసింది.

( ఇక్కడ నాకొక డౌటు. why is that ur best friend always has a lot of success with girls while all you can manage is a weak smile and a bear hello with them??)

as usual, మనోడు సొల్లు మొదలెట్టాడు. చెయ్యాల్సిన పని బండెడుంది. నాకు చిరాకేసి వాడిని ఫోను పెట్టమన్నాను.

నన్ను కూల్ చెయ్యడానికో ఏంటో,
"హే! నా ఫ్రెండుతో మాట్లాడు." అని ఫోను నాకిచ్చాడు.

మనమేం మాట్లాడతాం. ఫోను తీసుకుని హలో అన్నాను. ఆ అమ్మాయి కూడా హల్లో అంది.

కొంచం పని ఉందండి. మా వాణ్ణి కాస్సేపు వదలచ్చు కదా! అన్నా.

అటుపక్కనుంచి తెరలు తెరలుగా నవ్వు.

అంత జోకేమేసానబ్బా! అంతలా నవ్వుతోంది అనుకున్నా!

ఆ తర్వాత వచ్చింది సమాధానం.

" ఏం.. హిహి.. లేదండి. హిహి.. మీ... హిహి... వాయిస్ చాలా.. హిహి... విచిత్రంగా... హిహి"

నా రియాక్షను మీరే ఊహించుకోగలరు.

***************************

నా గొంతు కీచుగా ఉంటుంది నిజమే. కానీ మొదటి పరిచయంలోనే అలా అనెయ్యడమే??

అదే నేను ఓ అమ్మాయితో తొలి పరిచయంలో

"హి హి. మీ జుట్టు భలే ఉందండీ కొబ్బరి పీచులా" అంటే ఎలా ఉంటుంది.??

ఏదైమైనా ఇల్లాంటి సంఘటనలు నన్ను రాటు తేల్చాయి. తరువాత మా క్లాసులో అమ్మాయిలందరూ ఏకగ్రీవంగా నేను చిన్నపిల్లాడిలా ఉంటాననీ, నేను వాళ్ల తమ్ముడిలా అనిపిస్తానని డిక్లేరు చేసినప్పుడు కూడా గుండె పగలకుండా బతకగలిగానంటే ఇల్లాంటి అనుభవాలే కారణం.

అబ్బాయిల మధ్య ఎంత నికృష్టపు భాష మాట్లాడే అబ్బాయి ఐనా అమ్మాయిల ముందు చాలా decent language

వాడతాడే!మరి అమ్మాయిలు ఎందుకు reciprocate చెయ్యరు? నేను మా క్లాసు అమ్మాయిల దగ్గరకు వెళ్ళి మీరు చాలా బావున్నారు. నాకు నా లవరులా అనిపిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది?? ఇది పైకి absurd గా అనిపించచ్చు.

కానీ ఆ ఫీలింగు subjective కదా! అమ్మాయిలు ఆ మాట అంటే ఎలా ఫీల్ అవుతారో, ఒక అబ్బాయిని తమ్ముడూ అన్నా అలాగే ఫీల్ అవుతాడని common sense ఉండక్కర్లేద్దా??

ఏంటో... పోస్టు కామెడీగా రాద్దామని మొదలెట్టాను. సెకండ్ హాఫు సీరియస్ అయిపోయింది. బొమ్మ ఆడటం కష్టమే!

Friday, May 9, 2008

లేడీసున్నారు....కాస్త సర్దుకుంటారా??

ఈ డైలాగు మనం సర్వ సాధారణంగా సినిమా హాళ్లల్లో వింటుంటాం. మొన్నీ మధ్యో సినిమా కి వెళ్లాను. పెద్ద గుంపు గా ఒక కుటుంబం వచ్చింది. అందరికి ఒకచోట దొరకలేదు. రెండు వరసలలో సెటిలయ్యారు. ఒక పదిహేనేళ్ళ అమ్మాయి చివరకి కూర్చుని ఉంది. అంతలో ఓ పెద్ద మనిషి వచ్చి ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు. ఇహ ముందు వరసలో కూర్చున్న పెద్దావిడకి టెన్షను మొదలు. పక్కనే ఉన్న చిన్నపిల్లని ఆ సీట్లో కూర్చోబెట్టి ఆ అమ్మాయిని ఆ చిన్నపిల్ల సీట్లో కూర్చోమని సైగ చేసింది. ఆ అమ్మాయి అలా చేసాక ఆవిడ మొహంలో ప్రశాంతత! ఇదంతా గమనిస్తున్న నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు.

ఈ పరిస్థితి మీలో చాలా మంది face చేసే ఉంటారు.ఐతే వాళ్ళు సర్దుకుంటారు. లేకుంటే మనల్ని సర్దుకోమంటారు. నాలా ఒంటరి గా సినిమాలకి వెళ్ళే రకాలనైతే ఇంకానూ... అడిగే వాళ్ల కంఠంలో రిక్వెస్టు పాళ్ళు తక్కువగా, కమాండు పాళ్ళు ఎక్కువగా అనిపిస్తుంది.

అంతెందుకు, మనమే ఒక నలుగురం స్నేహితులం, ఇద్దరు ఆడ, ఇద్దరు మగ కలిసి సినిమాకి వెళ్ళామనుకోండి. మగాళ్లం ఇద్దరం ఆ చివరా ఈ చివరా కూర్చుని అమ్మాయిలని మధ్యలో కూర్చోబెడతామా లేదా??
నా బాధల్లా ఇదే... " ఏమిటీ దుస్థితి? ఎందుకీ దుస్థితి??"

i mean, ఒక స్త్రీ ఒక మగాడి పక్కన ఒక మూడు గంటలు కూర్చుంటే what's the big deal??
ఎందుకు మనం ఆమెని protect చెయ్యడానికి try చేస్తున్నాం??
ఎక్కడో చదివాను. బెడ్ రూములో పురుషుడు ఎప్పుడూ తలుపు ఉండే వైపు పడుకుంటాడట. స్త్రీ గోడ ఉండే వైపు పడుకుంటుందట. రాతియుగం కాలం నుంచి శత్రువుల నుంచి తన వాళ్ళని రక్షించుకోవాలనే instinct వల్ల subconsious గా అలా చేస్తామట. ఇది కూడా అలాగేనా??

ఊహూ. కాదు. ఇది మనం consious గా తీసుకునే నిర్ణయమే! but we would like to believe it was a subconsious choice!!

అసలు ఇంత చిన్న విషయానికి ఇంత ఆలోచించే పరిస్థితి ఎందుకు ఉంది???
అసలు సమస్య ఎక్కడ ఉంది??

చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళంటే వాళ్ళో అపురూపమైన వస్తువన్న భావన కలిగేలా ఉంటాయి పరిసరాలు.
బస్సుల్లో సెపరేటు సీట్లు.
రైళ్ళళ్ళో సెపరేటు బోగీలు.
సినిమా హాళ్ళ దగ్గర సెపరేటు క్యూలు...(ఇంకా నయం, సినిమా హాళ్లళ్ళో కూడా సిటీ బస్సుల్లోలాగా కుడి వైపు మగాళ్ళు, ఎడం వైపు ఆడాళ్ళు అని పెట్టలేదు.)
కాలేజీలో సెపరేటు సెక్షన్లు.
అన్నయ్య గారూ అని వరస కలిపితే గానీ ఆడవాళ్లకి పక్కింటి మగాడితో మాట్లాడలేని స్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో పెరిగిన మగవాడికి ఆడదాని స్పర్శ తగిలితేనే వికారపు అలోచనలు వస్తాయంటే రావా మరి??

నాకు తెలుసు మీరేమంటారో. సెపరేటు బోగీలు, సీట్లు ఉంటేనే ఆడవాళ్లకు రక్షణ అంతంత మాత్రంగా ఉంది. అంతా కలిపేస్తే ఇక వాళ్ళు బతకగలరా???
నిజమే!
actual గా ఇది ఒక catch 22 situation.
ప్రజల mindset మారితే గానీ పైవన్నీ సాధ్యపడవు.
పైవన్నీ జరిగితే గానీ ప్రజల mindset మారదు.
మరి solution ఏమిటో తెలిదు గానీ నా ఊహల్లో మన దేశంలో
ఈ సెపరేటు కౌంటర్లు,సీట్లు ఉండవు.
ఎక్కడైనా స్త్రీ,పురుషులు ఏ బిడియం లేకుండా పక్కపక్కన కూర్చుంటారు.
at the same time, స్త్రీ స్పర్శ తగిలినంతనే వికారపు ఆలోచనలు మగవాడికి రావు.

నాకు తెలుసు. నా జీవిత కాలంలో ఇవన్నీ జరిగే అవకాశం తక్కువే. అప్పటి దాకా ఈ " లేడీసుతో వచ్చాం, కొంచెం సర్దుకుంటారా?" అనే అభ్యర్ధనలు నాకు వినిపిస్తూనే ఉంటాయి
(ఎందుకో నా భావాలను అనుకున్నంతగా convey చెయ్యలేకపోయా!)

update:

నిన్న బస్సులో వెళ్తున్నా. ఒక యువజంట కూర్చునిఉంది. నా ధియరీ ప్రకారం అమ్మాయి కిటికి పక్కన కుర్చుని ఉంది. అబ్బాయి ఆ పక్కన కుర్చున్నాడు. పక్కన నిలబడ్డ ఇద్దరు మహానుభావులు ఆమెను చూపుల్తో తినేస్తున్నారు.

అదే ఆ అమ్మాయి వాళ్లకి అందుబాటులో కూర్చుని ఉంటే ఏమి చేసేవాళ్ళా అని అలోచించడానికే భయం వేసింది.

ఆ క్షణాన నాకు సుజాత గారి వ్యాఖ్యలో సత్యం అర్ధమైంది.

Friday, May 2, 2008

ధర్మ సందేహాలు

నాకు ఈ మధ్య కాలం లో వచ్చిన ధర్మ సందేహాలివి....

1. గంజాయి లాంటి మత్తు పధార్ధాలని ప్రభుత్వాలు ఎందుకు illegal చేస్తాయి? ప్రజల ఆరోగ్యం కోసమా?? అలా ఐతే

మరి మద్యం దుకాణాలను సర్కారు వారే ఎందుకు నడుపుతారు??? అవి కూడా ఆయుష్షు తగ్గించేవే కదా???

మద్యం తాగడం తప్పని నా ఉద్దేశం కాదు. అసలు పక్కవాడికి న్యూసెన్స్ కానంతవరకు నువ్వేం చేసినా సమస్య కాదని

నా ఫీలింగు. నా డౌటల్లా సిగరెట్టు పేకెట్ల మీద గుద్దినట్టు గంజాయి పేకేట్ల మీద కుడా "highly injurious to health.

government recommends you not to consume it" అన్న టైపులో ఒక వార్నింగు గుద్దేసి మార్కెట్లోకి

వదిలెయ్యచ్చు కదా?????

After all, If it can happen with cigarettes, why can't it happen for drugs???

నేనే అలవాటునీ సమర్ధించటం లేదు... తెగనాడటం లేదు. ఎవరి life వాళ్ళిష్టం. ఇలా ఎందుకు జరగడం లేదు అని

అడుగుతున్నానంతే....

2. మొన్నీ మధ్య ఒక IPL ళో అసభ్య ప్రదర్శనలను ఖండిస్తూ mumbai కి చెందిన ఒక మంత్రివర్యులు " స్త్రీ లని

పూజించే దేశం మనది. ఇలాంటివన్నీ ఎలా అనుమతిస్తాం?? " అన్నారట!

అమాఖ్యా! మన దేశం లో స్త్రీలకు పూజలు జరుగుతున్నాయన్న విషయం తెలిసి చాలా ఆనందమేసింది.

నేనిప్పటిదాకా మన దేశం లో స్త్రీలు దారుణంగా abuse,molestations కి గురి అవుతున్నారని భ్రమలో ఉన్నాను.

కళ్ళు తెరిపించారు. మరి ఈ దేశంలో ఊరికొక రెడ్ లైట్ ఏరియా ఎందుకున్నట్టు?? గంటకొక రేపు ఎందుకు

జరుగుతున్నట్టు??

మీరు bollywood సినిమాలు చూస్తారా?? ఆ డాన్సర్ల దుస్తులు మన టాప్ హీరోయిన్ల దుస్తుల కన్నా కురచగా

ఉన్నాయా??? మరి ఆ సినిమాల అవార్డు ఫంక్షన్లకి హాజరై వారితో కలిసి పత్రికలకు ఫోజులిస్తారే? ఆ సినిమాలని

నిషేదించచ్చు కదా??

నేను exposing ని వ్యతిరేకించట్లేదు. cheer leaders ని support చెయ్యట్లేదు. ఆయన గారి లాజిక్ చూసి

మండిందంతే...!

౩. తిరుపతి కెళ్లి రికమండేషన్ లెటర్లు చూపించీ, అక్కడ ఉద్యోగుల చెయ్యి తడిపీ, నానా అడ్డ దారుల్లో దర్శనం

చేసుకుంటామే.... అసలు కొద్దిగానైనా మనస్సాక్షి గగ్గోలు పెట్టదా?? అసలు దేవుడిని చూడటానికి ఒక మంత్రి

recommendation చెయ్యటమేంటి??

సందు చివర ఉన్న దేవుడి కన్నా తిరుపతి లో ఉన్న దేవుడు ఎలా గొప్ప అవుతాడు??

(I am expecting a lot of curses through comments due to this part!)


4. పురుషులతో స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి, పురుషులు స్త్రీలు సమానమే అని వాదించేవారు

at the same time స్త్రీలకు రిజర్వేషన్లు కావాలని ఎలా డిమాండ్ చేస్తారు?? రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు ఏదో ఒక విధంగా

backward అని, అలా కాకపోయినా atleast సమానం కాదు అని ఒప్పుకున్నట్టేగా???

5. ప్రతి పత్రికలోనూ, టీవీ షోల్లోనూ స్త్రీల కోసం ప్రత్యేక వ్యాసాలుంటాయ్, ప్రోగ్రాంలు ఉంటాయి. ఈ రోజే జ్యోతిగారు

మహిళా బ్లాగరుల కోసం ప్రత్యేక చర్చా వేదిక టైపులో ఏదో ఏర్పాటు చెయ్యబోతున్నట్టు బ్లాగారు.

మరి ఇలా పురుషులకి ఎందుకు స్పెషల్ గా సప్లిమెంట్లు, షో లు ఉండవు..??? మార్కెట్ లేదనా?? స్త్రీ జనాభా కన్నా

పురుష జనాభాయే ఎక్కువ కదా?? పురుషులకి appeal చేసే వ్యాసాలతో for men సప్లిమెంట్లు ఎందుకు రావు??
****************************************

నా లాజిక్కులు మీకు సిల్లీగా అనిపించచ్చు. ఇవి నా సందేహాలే గానీ అభిప్రాయాలు కావు. తప్పనిపిస్తే ఎందుకో

చెప్పండి. తెలుసుకుంటాను..

Tuesday, April 29, 2008

An Inconvenient Truth

ఇంటర్ దాకా నేను వేరే లోకం లో బతికాను. ఆ లోకంలో ఎంసెట్, క్రికెట్,ఇల్లు,స్నేహితులు తప్ప ఏమీ లేదు. అలాంటిది

ఇంజనీరింగ్ కోసం భీమవరం రాగానే నేను తిన్న షాకులు ఇన్నీ అన్నీ కాదు. కానీ, అన్నిటికన్నా ఎక్కువగా నన్ను బాధ పెట్టింది మాత్రం "కులం" అన్న పదం.

మీకు వెర్రితనంగా కనిపించవచ్చేమో గానీ, నేను అప్పటిదాకా ఈ కులం గిలం అనే ఫీలింగులన్నీ పెద్దవాళ్ళకే, మా "యంగ్ జనరేషన్" కి లేవు అనుకునేవాణ్ణి. అవును మరి, అప్పటిదాకా నా స్నేహితులతో అలాంటి చర్చ రాలేదు.

అసలు వాళ్ళది ఏ కులమో అన్న ఆలోచన కూడా నాకు రాలేదు. మరి ఇంజనీరింగ్ లో.....

****************************

మొదటి రోజు. నాన్న నన్ను దింపి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రే డాబా మీద నాకు "కులోపదేశం" జరిగింది.

"ఏమ్ కేస్టు..?" పేరు,ఊరు చెప్పిన వెంటనే వచ్చిన ప్రశ్న అది.

నాకు ఒక నిముషం ఏమ్ విన్నానో అర్ధం కాలేదు. అర్ధమయ్యాక చెప్పాను. సీనియర్ నవ్వాడు. పక్కనే ఉన్న ఇంకో జూనియర్ ని అడిగాడు. వాడూ చెప్పాడు. వాడిని వెంటనే ఇంకో సీనియర్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ప్రశ్నార్ధకం గా చూస్తున్న నాతో మొదటి సీనియరు "వాళ్ళోడే...." అన్నాడు. ఆ తర్వాత అతడి ఉపదేశం ఈ విధంగా సాగింది.


"చూడు తమ్ముడూ..! రేపు మనోళ్ళని పరిచయం చేస్తాను. టచ్ లో ఉండు. రేప్పుద్దున్న నీకేదైనా అవసరం వస్తే నీ ఫ్రెండ్సెవరూ సాయం చెయ్యరు. మనోళ్ళే చేస్తారు."


"ఈ ఊరులో *******ల డామినేషను ఎక్కువ!"


"మీ క్లాసు లో ఇంకా ఎవరెవరు మనోళ్ళునారో కనుక్కో! రేపు సాయంత్రం నాకు ఇవ్వాలి."

ఆ రోజు రాత్రి దుప్పటి ముసుగు కప్పుకుని వెక్కి వెక్కి ఏడిచాను. అది ర్యాగింగు వల్లా? ఇల్లు గుర్తురావడం వల్లా?నా ఒక చిన్న నమ్మకం నిర్ధాక్షిణ్యంగా నలిపివేయబడటం వల్లా అంటే మాత్రం చెప్పలేను.

On that night my little belief about the pristinity of young generation was shattered!


మా రూమ్మేటు ది కూడా అదే పరిస్థితి. నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగారా?? నీ కులం వాడి పేరే చెప్పాలి. వాడు ఒక హిట్టిచ్చి పదేళ్ళవుతున్నా, ఇంకా ఆప్పుడప్పుడే సినిమాలు చేస్తున్న బుడ్డోడైనా సరే..!

అదే నిన్ను ర్యాగింగ్ చేస్తున్నది వేరే కులం వాడైతే న్యూట్రల్ గా ఉండే పేరేదైనా చెప్పాలి.

"వాడితో తీసుకున్నావేరా రూము? మన వాళ్ళెవరూ దొరకలేదా??"

"ఒరేయ్! అక్కడ ఎవరో మన అమ్మాయిని ర్యాగింగ్ చేస్తున్నారట. పదండ్రా!"

కులం బలవంతంగా నరాల్లోకి ఇంజెక్టు చెయ్యబడుతుంది. you can't help it!
ఈ ఉన్మాదానికి పరాకాష్ట "కుల పండగలు". జనవరి లో వీటి హడావిడి మొదలవుతుంది. ప్రతీ కులానికి ఒక గ్యాంగ్ తయారై నాయకత్వ భాద్యతలు నెత్తిన వేసుకుంటుంది.
కాలేజ్ యాజమాన్యానికి తెలియకుండా రహస్యంగా ఏర్పాట్లు జరుగుతాయి. నేను రాను అని చెప్పినందుకు ఒక సీనియరు నాకిచ్చిన వివరణ ఇలా ఉంది.

" మేమేమీ కుల పిచ్చోళ్ళం కాదురా!ఏదో కొన్ని గంటలు సరదాగా
డాన్సులు కడతాం. అమ్మాయిలతో కబుర్లు చెబుతాం. తింటాం. వచ్చేస్తాం. ఈ మాత్రం దానికి పెద్ద సిద్ధాంతాలు,రాద్ధాంతాలు ఎందుకు బే??"

మరి నాకు ఈ "మనం" అన్న పదం దగ్గరే చిరాకొస్తోందే..?

ఈ కుల పండగల అజెండా ఇదీ....

అయా కులానికి చెందిన local heroes ని అతిధులుగా పిలుస్తారు.వారు ఆ కుల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ ప్రసంగిస్తారు.
తమ కుల హీరో పాటలకు డాన్సులు వెయ్యడం, వేరే కుల హీరోలని వేళాకోళం చేస్తూ skits చేయడం, and ofcourse flirting with the opposite sex of same caste!

it's a god damn brainwash!!!

మొత్తానికి కొన్ని నెలల వ్యవధిలో తెల్ల కాగితం లాంటి ఫ్రెషర్ మనసు మీద "కులకోటి" రాయబడుతుంది. ఆ పై సంవత్సరం వృత్తం మళ్ళీ మొదలవుతుంది.

ఇది కేవలం మా కాలేజ్ కే పరిమితం కాదు. నాకు తెల్సి ప్రతీ ఇంజనిరింగ్ కాలేజ్ లో జరిగేదే..! కాకపోతే dominant caste మారుతుంది అంతే.....


*******************************


నేనూ ఈ brainwash కు అతీతుడిని కాదు. సీనియర్ల వత్తిడి భరించలేక ఒక ఏడాది ఈ పండగకి వెళ్ళాను.

అప్పుడప్పుడూ నాలోనూ ఎక్కడో ఈ ఫీలింగ్ ఉందని నిరూపించే ఘటనలు జరుగుతుంటాయి. పేపర్లో ఎక్కడో నా కులం వాడికి ఎదైనా అవార్డు వచ్చిందని చదివినప్పుడు, ఎవరైనా పరిచయం చేసుకుంటూ తమ పేరు చెప్పినప్పుడు ఆ పేరులోexplicit గా నా కులం పేరు ఉన్నపుడు క్షణకాలం మనసులో ఎదో మెరుపు! మరుక్షణం సిగ్గేస్తుంది. ఆ తర్వాత దీనికి కారణమైన సీనియర్లపై కోపం వస్తుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత! అప్పుడు నాకు నేనే సర్దిచెప్పుకుంటాను.

"May be i have a bit of involuntary caste feeling. But atleast, i am not proud of it! "

Saturday, April 19, 2008

క్రికెట్టోపాఖ్యానం

ఈ రోజే సినిమాలు చూసే ప్రేక్షకులు ఎన్ని రకాలో విభజిస్తూ ఒక బ్లాగు చూసాను. అలాగే క్రికెట్టు మాచ్ లు చూసే వాళ్ళని కూడా విడదియ్యచ్చు కదా అనిపించింది. మన తెలుగు దర్సకుల్లా నిర్లజ్జగా అదే స్టైలులో ఈ పోస్టు రాయడానికి నిశ్చయించాను.

ఇండియాలో క్రికెట్ కున్న క్రేజు గురించి మళ్లీనేను చెప్పక్కర్లేదు. క్రికెట్ వస్తోందంటే కిళ్లీ కొట్ల నుంచి మల్తిప్లెక్సుల దాకా

ఎక్కడ టివి ఉంటే అక్కడే అతుక్కుపోతాము. అలా గుంపులో నిలబడి క్రికెట్ చూస్తున్నప్పుడు సాధారణమ్ గా

కనబడేవాళ్ళిదిగో...

నిశ్శబ్ద అభిమానులు:

వీళ్ళు పెద్దగా సందడి చెయ్యరు. మౌనంగానే ఆటని ఆస్వాదిస్తారు. మహా ఐతే అందరితో కలిసి చప్పట్లు కొడతారంతే....

కాని ఈ కేటగిరి చాలా రేర్.

వీరాభిమానులు:

అసలు హడావిడి అంతా వీళ్ళదే... ఇండియా గెలుస్తుంటే విజిల్సూ, ఓడుతుంటే నిట్టూర్పులూ...అసలు

ఓడిపోతున్న మన వాళ్ళు కూడా అంత ఫీలవరేమో...

షాట్లు కొడుతుంటే కేకలు మావా అంటారు. రెండు బాల్సు తిన్నారా.. ఎవడ్రా వీడిని సెలెక్ట్ చేసింది?? అని ఎగురుతారు.

రెండు వైడులు వేస్తే యార్కరు వేయడం కూడా రాదారా వీడికి?? అని అమితాశ్చర్యపోతారు.

వీళ్ళని అబ్జర్వు చెయ్యండి ఈ సారి. భలే కామెడీ గా ఉంటుంది.

నిరాశావాదులు:

వీళ్ల పక్కన ఉన్నామంటే నరకమే... మనమ్ మాచ్ గెలిచే చాన్సు కిన్చిత్ కూడా లేదని వీళ్ళ ప్రగాఢ నమ్మకం.

అయినా చూస్తారు. చూస్తూ ఉరుకుంటారా.... 20 బాల్సులో ౩౦ కొట్టాలా? మనవల్లెక్కడవుతుందీ... మాచ్ పోయినట్టే... అని పెదవులు విరుస్తూ వాళ్ళ predictions తో మన బుర్ర తింటారు.

ఆశావాదులు:

ఈ పాటికి మీకు అర్థమైపోయే ఉంటుంది. 50బాల్సు లో 150 కొట్టాలి, శ్రీశాంత్,మునాఫ్ బాటింగు చేస్తున్నా వీళ్ళు ఆశ వదులుకోరు. పైగా శ్రీశాంత్ ఒకసారి రెండు సిక్సులేసాడు తెలుసా అని statistics చెబుతారు.

వీళ్ల వల్ల మనకి అట్టే బాధ లేదు.

విర్చువల్ కెప్టెన్లు: ( సరైన తెలుగు పదం దొరకలేదు. మన్నించండి)

ధోనీ కన్నా తామే మంచి కెప్టెన్ లమని వీళ్ళ నమ్మకం. టీవీ ముందు నిలుచునే సలహాలు ఇచేస్తారు.

"ఇఫ్ఫుడు పఠాన్ ని దింపాలి బౌలింగుకి..."

" ద్రావిడ్ దిగేడేంట్రా బాబూ...!"

" మూడో స్లిప్పుని తీసేసి మిడ్ ఆన్ లో పెడితే దొరికిపోతాడ్రా. ఆ మాత్రం ఐడియా రాలేదు వీడికి..."

ఇల్లా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. చేతిలో ఉన్న కూల్ డ్రింక్ బాటిలుతో వాళ్ల బుర్ర పగలగొట్టాలనిపిస్తుంది నాకైతే...

అభిమాన సంఘాలు:

సినిమాల్లోకి మల్లే ఇక్కడా వీరాభిమానులు ఉంటారు. వాళ్ళ అభిమాన ప్లేయరు లేనిదే జట్టు గెలవడం కల్లని

వీళ్ళ నమ్మకం. అందుకే సదరు ఆటగాడు అవుటవ్వగానే లేచి వెళ్ళిపోతుంటారు.

ఇండియా గెలిచిందా లేదా అన్నదానికంటే ఆ ప్లేయరు బాగా ఆడాడా లేదా అన్నదే వీరికి ముఖ్యం.

వీళ్ళకి కిర్రెక్కించాలంటే ఆ ప్లేయరు ని ఓ మాటని చూడండి. దెబ్బకి పోలేరమ్మ పూనకపోతే అడగండి!

దేశభక్తులు:

వీరిది అదోరకం దేశభక్తి. పాకిస్తాన్ ఆటగాడు ఏమీ అనకపోయినా వీళ్ళు మాత్రం "మార్ సాలే కో, మార్" అని

తెగ ఆవేశపడిపోతుంటారు.

ఇక పాకిస్తాన్ వాడు కాస్త ఎక్కువ చేసాడా?? అక్కడ మాచ్ రిఫరీ ,అంపైర్ రియాక్షన్ల కన్నా వీళ్ల రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. నాలుగు ఐదు బూతులతో వాణ్ణి కడిగేస్తే గానీ వీళ్ళకి మనస్సాంతి ఉండదు.

నాకైతే కొన్నిసార్లు మొత్తం "దేశభక్తి" అన్న కాన్సెప్ట్ మీదే విరక్తి వస్తూ ఉంటుంది.

ఉపసంహారం:

ఇవీ ఈ రోజు క్రికెట్ చూస్తూ నేను పరిశీలించిన స్వభావాలు. నాకైతే క్రికెట్టు చూడటం ఎంతో, ఈ విభిన్న కేటగిరీల జనాలని గమనించడం కూడా అంతే సరదాగా అనిపిస్తుంది!

లోకోభిన్నరుచి.....

Sunday, April 6, 2008

నీహారిక

ఇంకా వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోకముందే సముద్రం ఒడ్డున ఇసుకలో కూర్చుని ఆ అలలు మీతో చెప్పే గుసగుసలని వినడానికి ప్రయత్నించారా?

వణికించే చలికాలంలో పొద్దున్న నీరెండ శరీరానికి చురుక్కుమని తగులుతుంటే కలిగే హాయిని అస్వాదించారా?

వెన్నెల వెలుగులో ముస్తాబైన లోకాన్ని చూడాలా? లేక ఆకాశం ఆంతా నిండిన ఆ జాబిలిని చూడాలా? అన్నసందిగ్ధం లో ఎప్పుడైనా కొట్టుమిట్టాడారా?

అసలంత సౌందర్యం భరించలేక కళ్ళల్లో ఎప్పుడైనా నీళ్లు తిరిగాయా?

ధనుర్మాసంలో చుట్టూ ఉన్నప్రపంచాన్ని పొగమంచు కప్పేసిన సుప్రభాత వేళ చెప్పులు లేకుండా పచ్చిక మీద నడిచారా? మంచు బిందువులు పాదాలకు చక్కిలిగింతలు పెడుతుంటే ఆ గిలిగింత ఎలా ఉంటుందో అనుభవమేనా?

భోరున కురిసినవాన వెలిసిన తరువాత తడిసి ముద్దైన ప్రకృతి కాంత సొగసులు గమనించారా? ఆకుల మీద నిలిచిన నీటి బిందువుల లావణ్యం చూసారా?

నడివేసవి మధ్యాన్నంఒక చెట్టు కింద సేద తీరుతూ పరిసరాలని గమనించారా? ఆకుల గలగలలు,వీచే గాలి, కూసే పక్షులు మీతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపించిందా?

పౌర్ణమి రోజు సాగర తీరాన పొంగి వస్తున్నఅలల మీద నాట్యమాడుతున్న చంద్రకిరణాలతో స్నేహం చేసారా?

******************

ఆలోచిస్తే ప్రపంచంలోని గొప్ప గొప్ప ఆనందాలన్నీ డబ్బు తో కొనలేనివే....

ఆస్వాదిస్తే అన్నిటికన్నా గొప్ప కవిత్వం ప్రకృతే...